Panchayat Polls: తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు సత్తా చాటారు. మొత్తం 4,231 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరగ్గా కాంగ్రెస్ 2,383 బీఆర్ఎస్ 1,146, బీజేపీ 181, ఇతరులు-455 సీట్లను కైవసం చేసుకున్నారు. మొదటి స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థులు ఉండగా.. బీఆర్ఎస్ రెండో స్థానానికి పరిమితమైంది. మరోవైపు.. బీజేపీ కంటే ఇతరులకు ఎక్కువ సీట్లు రావడం గమనార్హం. తొలి విడతలో మొత్తం పోలింగ్ శాతం 84.28 కాగా.. యాదాద్రిలో అత్యధికంగా 92.88 శాతం పోలింగ్ నమోదైంది. తొలి ఫలితాల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మరోవైపు.. జిల్లాలో ఈనెల 14న జరిగే రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారాలు శుక్రవారం సాయంత్రంతో ముగియనున్నాయి. ఏకగ్రీవాలు మినహాయించి మిగతా చోట్ల గత వారం రోజులుగా ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ ఓటు వేయాలని అభ్యర్థించారు. గెలిపిస్తే గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉంటామంటూ హామీలు గుప్పించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కోసం వినూత్న రీతిలో ప్రచారం సైతం నిర్వహించారు. రెండో దశ పోలింగ్‌లో ఎవరు సత్తా చాటనున్నారో తెలియాల్సి ఉంది.
READ MORE: Effects of Lack of Sleep: నిద్రలేమితో బరువు పెరుగుతారని మీకు తెలుసా..
కాగా.. తొలి విడతలో ఆసక్తికర విషయం ఘటనలు సైతం చోటు చేసుకున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చింతల్ ఠానా ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది.. గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన అభ్యర్థి సర్పంచిగా గెలుపొందారు.. వేములవాడ అర్బన్ మండలంలోని చింతల్ ఠానా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన చెర్ల మురళి తన సమీప ప్రత్యర్థి పై 370 ఓట్లతో గెలుపొందారు.. కానీ.. చెర్ల మురళి ఈనెల 5వ తేదీన గుండెపోటుతో మృతి చెందారు.. మొత్తం 1717 ఓట్లు పోల్ కాగా, బీఆర్ఎస్ చెర్ల మురళి 739, బీజేపీ సురువు వెంకటి 369, కాంగ్రెస్ కోలాపురి రాజమల్లు 333 ఓట్ల వచ్చాయి. మరోవైపు.. ఉప వార్డు సభ్యులు సర్పంచ్‌గా కుమార్‌ను ఎన్నుకున్నారు. గెలిచిన అభ్యర్థి మృతి చెందడంతో సర్పంచ్ ఎన్నికను ప్రకటించకుండా ఎలక్షన్ కమిషన్‌కు పంపిస్తామని అధికారులు తెలిపారు. ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. దీంతో ఏం జరగనుందా? అనే ఉత్కంఠ మొదలైంది.
