Telangana Panchayat Elections: తొలి దశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతగా ముగిశాయి. తొలివిడతకు సంబంధించి మొత్తం 4,236 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా గురువారం 3,836 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఈ విడతలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటారు. మొదటి స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థులు ఉండగా.. బీఆర్ఎస్ రెండో స్థానానికి పరిమితమైంది. మరోవైపు.. బీజేపీ కంటే ఇతరులకు ఎక్కువ సీట్లు రావడం గమనార్హం. తొలి విడతలో మొత్తం పోలింగ్ శాతం 84.28 కాగా.. యాదాద్రిలో అత్యధికంగా 92.88 శాతం పోలింగ్ నమోదైంది. అయితే.. తొలి విడతలో చాలా మంది అదృష్టవంతులు ఉన్నారు. అనేక మంది కేవలం ఒక్క ఓటు తేడాదితో గెలుపొందారు. పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం..
1.కుమురం భీం జిల్లా: జిల్లా పరిధిలోని కెరమెరి మండలంలోని పరందొలి గ్రామ సర్పంచిగా రాథోడ్ పుష్పలత ఒక్క ఓటుతో విజయ ఢంకా మోగించింది. ప్రత్యర్థి దిలీప్‌పై ఒకే ఓటు ఆధిక్యంతో గెలిచినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఈ ఊర్లో ఉన్న 873 ఓట్లకుగానూ.. దిలీప్‌కు 101 ఓట్లు, పుష్పలతకు 102 ఓట్లు సాధించారు. ఈ గ్రామ పంచాయతీలో మొత్తం ఏడుగురు అభ్యర్థులు బరిలో దిగారు. చివరికి పుష్పలకు అదృష్టం వరించింది.
2. కామారెడ్డి జిల్లా: రాజంపేట మండలంలోని నడిమి తండా గ్రామ పంచాయతీలో ఇదే తరహా ఘటన జరిగితంది. ఇక్కడ సైతం కేవలం ఒక్క ఓటు తేడాతో బానోత్ లక్ష్మి తన సమీప ప్రత్యర్థి బానోత్ సునీతపై గెలిచింది. లక్ష్మికి 290 ఓట్లు రాగా సునీతకు 289 ఓట్లు వచ్చాయి. దీంతో ఒకే ఓటు తేడాతో లక్ష్మి విజయం సాధించినట్లు అధికారులు స్పష్టం చేశారు.
3. నిర్మల్ జిల్లా: నిర్మల్ జిల్లా కడెం మండలం కల్లెడలో తాటి రుక్మిణీదేవి, వెంబడి లక్ష్మి అనే ఇద్దరు అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో రుక్మిణికి 343, లక్ష్మికి 343 ఓట్లు వచ్చాయి. కానీ.. ఇక్కడ లక్ష్మిని దురదృష్టం వెంటాడింది. లక్ష్మికి వచ్చిన ఓట్లలో ఒక ఓటు చెల్లుబాటు కాలేదు. దీంతో రిటర్నింగ్ అధికారులు ఆ ఓటు తిరస్కరించారు. అనంతరం రీ కౌంటింగ్ నిర్వహించారు. అభ్యర్థుల సమక్షంలోనే అధికారులు చెల్లని ఓటును గుర్తించి లెక్కింపు చేపట్టారు. దీంతో ఒకే ఓటు ఆధిక్యంతో రుక్మిణీదేవి విజయం సాధించింది.
4. జనగామ జిల్లా: జిల్లా పరిధిలో చెల్లని ఓటు ఓ గ్రామ సారథిని మార్చేసింది. ఈ కథ రఘునాథపల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా గంపల నర్సయ్య, అదే పార్టీ నుంచి రెబల్‌గా పోటీ చేసిన గడ్డం జోజిది. ఓట్ల లెక్కింపులో జోజికి 211 ఓట్లు, నర్సయ్యకు 210 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటు తేడా రావడంతో తిరిగి లెక్కించాలని నర్సయ్య, ఆయన తరఫు నాయకులు పట్టుబట్టారు. అధికారలు అభ్యర్థుల ముందే లెక్కించారు. దీంతో జోజికి పడిన ఓట్లలో ఒకటి చెల్లనిదిగా అధికారులు గుర్తించారు. దీంతో చెరో 210 ఓట్లు వచ్చినట్లు అధికారులు తేల్చారు. ఇరు అభ్యర్థులకు సమాన ఓట్లు వచ్చినప్పుడు ఫలితం కోసం డ్రా తీశారు. దీంతో ఆ డ్రాలో జోజి గెలిచారు.
5. నిజామాబాద్ జిల్లా మూడు సార్లు కౌంటింగ్: జిల్లా పరిధిలోని బోధన్ మండలం కల్దుర్కి గ్రామ పంచాయతీలో ఆసక్తికరం, ఉత్కంఠగా ఓట్ల లెక్కింపు కొనసాగింది. అధికార్లు ఎంతో ఓపికగా మూడు సార్లు లెక్కింపు చేపట్టారు. మొదటిసారి లెక్కింపులో కాంగ్రెస్ మద్దతుదారు నరేందర్‌రెడ్డికి 866, మరో అభ్యర్థి శ్రీనివాస్‌కు 863 ఓట్లు వచ్చాయి. దీంతో తక్కువ ఓట్లు వచ్చిన శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మరో సారి లెక్కింపు చేపట్టాలని పట్టుబట్టారు. దీంతో అధికారులు రెండో మారు లెక్కింపు చేపట్టారు. క్షణ్ణంగా పరిశీలించి లెక్కించిన అధికారులు నరేందర్‌రెడ్డికి పోలైన వాటిలో 5, శ్రీనివాస్‌కు పడిన వాటిలో 3 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. దీంతో నరేందర్‌రెడ్డికి 861, శ్రీనివాస్‌కు 860 ఓట్లు దక్కాయి. కానీ.. అభ్యర్థి శ్రీనివాస్ నిరాశ వ్యక్తం చేస్తూ.. మూడో సారి లెక్కింపు జరపాలని డిమాండ్ చేశారు. చేసేదేమి లేక అధికారులు అభ్యర్థుల ముందే లెక్కింపు చేపట్టారు. ఈసారి సైతం నరేందర్‌రెడ్డి 861 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయనే గ్రామ సర్పంచ్‌గా రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు.
