Site icon NTV Telugu

Telangana MLAs Defections Case: ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో స్పీకర్ కీలక తీర్పు!

Telangana MLA Defection Case

Telangana MLA Defection Case

తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ కీలక తీర్పు వెలువరించారు. ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌లను స్పీకర్‌ కొట్టివేశారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, గూడెం మహిపాల్‌ రెడ్డి, ప్రకాశ్‌ గౌడ్‌లపై అనర్హత వేటు వేయడానికి నిరాకరించారు. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్లు ఎక్కడా ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టం చేశారు. అనర్హత వేటుకు తగిన ఆధారాలు లేవని, సాంకేతికంగా ఐదుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లోనే ఉన్నట్టు స్పష్టం చేశారు.

బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించినట్లు 10 మంది ఎమ్మెల్యేలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. డిసెంబర్ 18లోగా నిర్ణయాన్ని తమకు సీల్డ్‌ కవర్‌లో సమర్పించాలని సుప్రీంకోర్టు గత విచారణ సందర్భంగా తెలంగాణ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో స్పీకర్‌ గత నెల రోజులుగా ఎమ్మెల్యేల విచారణను వేగవంతం చేశారు. 8 మందికి సంబంధించి విచారణను స్పీకర్‌ పూర్తి చేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహరిపై దాఖలైన పిటిషన్లపై విచారణ ఇంకా పూర్తి కాలేదు.

Also Read: NTR Fan Raju: ఎన్టీఆర్ వీరాభిమాని ‘ఎన్టీఆర్ రాజు’ ఇకలేరు!

8 మంది ఎమ్మెల్యేలకి సంబంధించి విచారణ పూర్తి చేసిన స్పీకర్‌.. ఇవాళ ఐదుగురికి సంబంధించి తీర్పు ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ తరఫు న్యాయవాదులతో పాటు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల తరఫు న్యాయవాదులు ఈరోజు అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంకు చేరుకున్నారు. అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ స్పీకర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. అనర్హత వేటుకు తగిన ఆధారాలు లేవని పేర్కొన్నారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాలే యాదయ్య, సంజయ్‌ కుమార్‌కు సంబంధించి రేపు తీర్పు వెలువడనుంది.

Exit mobile version