NTV Telugu Site icon

Sridhar Babu: ప్రజలకు లబ్ధి చేకూర్చే కార్యక్రమాలను చేపట్టాం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

It Minister Sridhar Babu

It Minister Sridhar Babu

Sridhar Babu: కరీంనగర్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ, ఉద్యోగ నియామక ప్రక్రియ వంటి కీలక అంశాలపై స్పందించారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ వైఖరి ఏమిటి? అంటూ ప్రశ్నించిన మంత్రి, త్వరలో అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. బీజేపీ నిజంగా బీసీలకు న్యాయం చేయాలనుకుంటే పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేస్తుందా లేదా? అని సూటిగా ప్రశ్నించారు. అలాగే ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా పరిష్కార మార్గాన్ని సూచించింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా పలు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి స్పష్టం చేశారు.

Read Also: SLBC Tunnel: క్షణక్షణం ఉత్కంఠ.. సన్నగిల్లుతున్న ఆశలు!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని పదేళ్లు ఎదురుచూశారని గుర్తుచేసిన శ్రీధర్ బాబు, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారదర్శకంగా ఉద్యోగ నియామక ప్రక్రియను ప్రారంభించామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో చిన్న చిన్న సాంకేతిక సమస్యల కారణంగా వేలాది మంది యువతకు ఉద్యోగాలు దక్కలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్, బీజేపీలు ఒకరికొకరు మద్దతుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించిన మంత్రి, తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రూప్-1 నోటిఫికేషన్ ఒక్కటే ఇచ్చారని.. అది కూడా కాంగ్రెస్ హయాంలో మాత్రమే విడుదలైనట్లు గుర్తుచేశారు. బీజేపీకి నిజంగా ఉద్యోగ నియామకాలపై చిత్తశుద్ధి ఉంటే ఆ సమయంలో ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తే, బీజేపీ దాన్ని అడ్డుకునేందుకు పని చేయడం మాత్రమే జరిగిందని మండిపడ్డారు. ఇప్పుడైనా బీజేపీ తమ వైఖరిని స్పష్టంగా తెలియజేయాలని మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై అవాస్తవ ఆరోపణలు చేయడం కంటే, ప్రజల కోసం నిజమైన అభివృద్ధి పనులు చేయాలని హితవు పలికారు.