IT Minister Sridhar Babu: రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలకు బిగ్ బూస్ట్.. కొత్త GCC పాలసీపై ఐటీ మంత్రి కీలక ప్రకటన

Sridhar Babu

Sridhar Babu

IT Minister Sridhar Babu: గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన ఐటీ హబ్స్, టవర్లపై అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయించామని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. యాంకర్ పార్టనర్స్ లేదా ఇండస్ట్రీ పార్టనర్స్ భాగస్వామ్యం లేకుండానే గతంలో వీటిని నిర్మించడం వల్ల చాలా చోట్ల ఇవి నిరుపయోగంగా మారాయని తెలిపారు. నిజామాబాద్ ఐటీ టవర్, ఐటీ హబ్‌పై శాసనసభ్యుడు అడిగిన ప్రశ్నకు శ్రీధర్ బాబు శాసనసభ వేదికగా సమాధానమిచ్చారు. ప్రణాళికారాహిత్యంతో మూతపడిన ఐటీ హబ్‌లను తిరిగి వినియోగంలోకి తెచ్చేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోందని స్పష్టం చేశారు.

“హైదరాబాద్‌పై ఒత్తిడిని తగ్గించేందుకు.. నల్గొండ, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్ లాంటి టైర్ – 2 నగరాలకూ ఐటీ కంపెనీలకు విస్తరిస్తున్నాం. త్వరలోనే ఆదిలాబాద్‌లో ఐటీ హబ్/టవర్‌ను లాంఛనంగా ప్రారంభించబోతున్నాం. యాంకర్ పార్ట్ నర్స్/ఇండస్ట్రీ పార్ట్ నర్స్ ముందుకొస్తే కొత్తగా ఐటీ హబ్స్/టవర్లను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి కేంద్రం ఏ మాత్రం సహకరించడం లేదు. ఈ విషయంలో బీజేపీ సభ్యులు చొరవ తీసుకోవాలి. తెలంగాణ యువతకు మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేలా మా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోంది. గత రెండేళ్లలో 75కి పైగా జీసీసీలు హైదరాబాద్ లో ప్రారంభమయ్యాయి. ఇది దేశంలోనే రికార్డు. రెండేళ్ల హయాంలో లక్ష మంది యువతకు కొత్తగా ఉద్యోగాలు దక్కాయి. త్వరలోనే కొత్త జీసీసీ పాలసీని తీసుకొస్తున్నాం. ఇందుకు సంబంధించిన కసరత్తు కొనసాగుతోంది. ఐటీ కంపెనీలకు సంబంధించిన కాంప్రహెన్సివ్ ఎకో సిస్టంను అభివృద్ధి చేయడంలో డేటా సెంటర్లు కీలక పాత్ర పోషించబోతున్నాయి. అందుకే.. వాటిపైన ప్రత్యేక దృష్టి సారించాం. రాబోయే రోజుల్లో డేటా సెంటర్ల వల్ల ఏర్పడబోయే సవాళ్లను ఎదుర్కొనేలా ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టాం. స్థానిక అవసరాలకు ఇబ్బంది తలెత్తకుండా డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ ను అందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. టైర్ 2, టైర్ 3 నగరాలు, పట్టణాల్లోనూ డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం.” అని శ్రీధర్ బాబు సమాధానమిచ్చారు.