Site icon NTV Telugu

YS Viveka Case: అవినాష్‌రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట.. బెయిల్ వచ్చేసింది.. కానీ..!

Ys Viveka Case

Ys Viveka Case

YS Viveka Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోన్న వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి ప్రయత్నాలు ఫలించాయి.. తెలంగాణ హైకోర్టులో ఆయనకు ఊరట లభించింది. వైఎస్‌ వివేకా కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్‌రెడ్డి.. పలుమార్లు సీబీఐ విచారణకు హాజరయ్యారు.. ఇక, తన తల్లి అనారోగ్యసమస్యలతో సీబీఐని సమయం కోరారు.. మరోవైపు.. ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నాలు సాగించారు.. మొత్తంగా ఈ రోజు అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది హైకోర్టు.. ఇవాళ తుది తీర్పు వెలువరించిన హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌.. అవినాష్‌రెడ్డికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది..

ఇక, ఇదే సమయంలో ప్రతి శనివారం సీబీఐ ముందు హాజరు కావాలని ఎంపీ అవినాష్‌రెడ్డిని ఆదేశించింది హైకోర్టు.. జూన్‌ చివరి వరకు ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటల మధ్య సీబీఐ విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది.. మరోవైపు, హై కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని స్పష్టం చేసింది.. దర్యాప్తు సంస్థకు అవినాష్ రెడ్డి సహకరించాలని సూచించింది.. మరో అవినాష్‌రెడ్డికి వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం కూడా చూపించలేదని వ్యాఖ్యానించిన హైకోర్టు.. ఐదు షరతులతో కూడి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.. రూ.5 లక్షల పూచీకత్తుతో రెండు షూరిటీలు ఇవ్వాలని పేర్కొంది..

కాగా, వైఎస్‌ వివేకా కేసులో ముందస్తు బెయిల్‌ కోసం ఏప్రిల్‌ 17వ తేదీనతెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు కడప ఎంపీ అవినాష్‌రెడ్డి… అయితే అప్పటి నుంచి ఆ పిటిషన్‌పై విచారణ అనేక మలుపులు తిరిగింది. చివరికి.. సుప్రీం కోర్టు జోక్యంతో ఎట్టకేలకు ఆయన ఊరట లభించింది. అవినాష్‌రెడ్డికి బెయిల్‌ పిటిషన్‌ వేసే హక్కు ఉందని, పిటిషన్‌పై వాదనలు వినాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో.. అందుకు అనుగుణంగా వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు వేకేషన్‌ బెంచ్‌.. ఈ రోజు తీర్పు వెలువరించింది.

Exit mobile version