High Court Lifts Stay: గుడ్ న్యూస్.. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లపై స్టే ఎత్తివేత.!

  • సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ..
  • తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌..
  • కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలపై విధించిన..
  • మధ్యంతర స్టేను ఎత్తేసిన హైకోర్టు డివిజన్‌ బెంచ్‌..
High Court

High Court

High Court Lifts Stay: తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ అమలుపై హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ పథకాల అమలుపై సింగిల్‌ బెంచ్‌ గతంలో విధించిన మధ్యంతర స్టేను హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఎత్తివేసింది. సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌పై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల ద్వారా పేద కుటుంబాలకు చెందిన యువతుల వివాహాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది. అయితే ఈ పథకాల అమలుకు సంబంధించిన కొన్ని జీవోలపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన సింగిల్‌ బెంచ్‌ మధ్యంతర స్టే విధించింది. దీంతో పథకాల అమలుపై అనిశ్చితి నెలకొంది. అయితే సింగిల్‌ బెంచ్‌ స్టేను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ వాదనలు వినిపిస్తూ.. పేద కుటుంబాలకు చెందిన యువతుల వివాహాలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు సామాజిక, ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతున్నాయని కోర్టుకు వివరించారు.

సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల కారణంగా వేలాది మంది పేద లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. పథకాల చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన ప్రధాన పిటిషన్‌కు ప్రజా ప్రయోజనం లేదని, దాన్ని కొట్టివేయాలని కోర్టును కోరారు. దీనితో విచారణ సందర్భంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలపై కాగ్‌ నివేదికలో అసలు అభ్యంతరం వ్యక్తం చేశారా..? అనే అంశంపైనా ధర్మాసనం ప్రశ్నలు లేవనెత్తినట్లు సమాచారం. కాగ్‌ నివేదికలో ఈ పథకాలకు సంబంధించిన అంశం లేకపోతే వాటి అమలును ఎందుకు నిలిపివేయాలని కోర్టు ప్రశ్నించింది.