Site icon NTV Telugu

GST: తెలంగాణలో భారీ జీఎస్టీ కుంభకోణం.. రూ.84 కోట్లు కొట్టేసిన కేటుగాడు…

Gst In Telangana

Gst In Telangana

తెలంగాణలో భారీ జీఎస్టీ (GST) కుంభకోణాన్ని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఛేదించారు. నకిలీ ఇన్వాయిస్‌లతో ప్రభుత్వ ఖజానాకు కన్నం వేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ కమర్షియల్ ట్యాక్సెస్ శాఖ రాష్ట్రంలో జరుగుతున్న భారీ పన్నుల దోపిడీని వెలుగులోకి తెచ్చింది. ఫేక్ ఇన్వాయిస్‌లు సృష్టించి, అసలు సరుకు సరఫరా చేయకుండానే దాదాపు రూ.84.15 కోట్ల మేర ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) పొందిన భారీ మోసాన్ని అధికారులు కనిపెట్టారు. ఈ అక్రమాలకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఎస్‌కేజీ (SKG) ట్రేడింగ్ కంపెనీ యజమాని సందీప్ కుమార్ గోయల్‌ను అధికారులు అరెస్ట్ చేశారు.

Also Read:AP Cabinet Meeting: ఏపీ క్యాబినెట్‌లో కీలక నిర్ణయాలు.. మరో పథకం అందుబాటులోకి..

అసలు మోసం జరిగిందిలా..
వాణిజ్య పన్నుల శాఖ నిర్వహించిన విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటపడ్డాయి. సందీప్ కుమార్ తన ఎస్‌కేజీ ట్రేడింగ్ కంపెనీ ద్వారా ఎలాంటి వస్తువులను విక్రయించకుండానే.. కేవలం కాగితాల మీద ఇన్వాయిసులు సృష్టించి కోట్లాది రూపాయల ఐటీసీని క్లెయిమ్ చేసినట్లు అధికారులు నిర్ధారించారు. ఇతను కేవలం ఒక్క కంపెనీకే పరిమితం కాకుండా.. హెచ్‌ఎఫ్‌సీ స్టీల్ ట్యూబ్స్ అండ్ వాల్వ్స్, విజయ్ ఇండస్ట్రియల్ నీడ్స్ LLP వంటి ఇతర సంస్థల పేర్లతో కూడా ఇదే తరహా అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు.

Also Read:Gas Effect: గ్యాస్ కొరత.. పెరిగిన హోటల్ ఫుడ్ ఐటమ్స్ ధరలు..

ఈ మోసం బయటపడటంతో అధికారులు తక్షణమే రంగంలోకి దిగారు. అక్రమాలకు పాల్పడిన రెండు సంస్థల జీఎస్టీ రిజిస్ట్రేషన్లను రద్దు చేశారు. నిందితుడు సందీప్ కుమార్‌పై తెలంగాణ GST చట్టం-2017 కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా.. న్యాయమూర్తి అతనికి జ్యుడీషియల్ కస్టడీ విధించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే ఇలాంటి నకిలీ ఐటీసీ క్లెయిమ్‌లపై ఉక్కుపాదం మోపుతామని వాణిజ్య పన్నుల శాఖ హెచ్చరించింది. ఎస్‌కేజీ ట్రేడింగ్ కంపెనీ లావాదేవీలపై మరింత లోతైన దర్యాప్తు జరుపుతున్నామని.. ఈ గొలుసుకట్టు మోసంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. నకిలీ ఇన్వాయిస్‌లు సృష్టించే వారిపై నిరంతర నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.

Exit mobile version