Telangana New Ration Cards: తెలంగాణలో లక్షలాది మంది కొత్త రేషన్ కార్డుల కోసం వేచి చూస్తున్నారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో కూడా కొత్త రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం దరఖాస్తులను తీసుకుంది. అయితే తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాత పద్ధతిలోనే స్థానిక మీసేవా కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని తెలిపింది. ఫిబ్రవరి నెలాఖరు నాటికి దరఖాస్తుల స్వీకరణ పూర్తి చేయాలని అధికారులకు చెప్పింది.
Read Also: France President: నేడు జైపూర్‌కి ఫ్రాన్స్ అధ్యక్షుడు.. ప్రధాని మోడీతో కలిసి రోడ్ షో..
ఇక, ప్రజా పాలనలో మొత్తం 1.25 కోట్ల దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. అయితే వీటిలో కొత్త రేషన్ కార్డులు, భూ వివాదాలకు సంబంధించిన దరఖాస్తులు దాదాపు 20 లక్షలకు పైగానే ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 90 లక్షల మందికి మాత్రమే రేషన్ కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా 2.8 కోట్ల మందికిపైగా లబ్ధి పొందుతున్నారు. అయితే ఇంకా 20 లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఊహించిన దానికంటే ఎక్కువ మంది కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేయడంతో పాత పద్ధతిలోనే స్థానిక మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
కొత్త రేషన్ కార్డు దరఖాస్తుల కోసం నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ ద్వారా ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను కూడా తెలంగాణ ప్రభుత్వం రెడీ చేసినట్లు సమాచారం. వీలైనంత త్వరగా రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తి చేసి అర్హులైన వారికి అందజేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ యోచిస్తుంది. ఈ కార్డు ఉంటేనే ప్రభుత్వ పథకాలు పొందేందుకు అర్హత సాధిస్తారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడంతో లక్షలాది మంది వీటి కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే సాధ్యమైనంత తర్వాత కొత్త రేషన్ కార్డులను జారీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడతోంది.
Read Also: Health Tips : బొప్పాయి గింజలను పరగడుపున తీసుకుంటే బరువు తగ్గుతారా?
కొత్త రేషన్ కార్డుతో పాటు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో పేర్లు చేర్పులు- మార్పులు చేసుకోవాలన్నా మీ సేవ కేంద్రాల్లోనే దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అధికారుకు సూచించింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుల ఈ-కేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. అసలైన లబ్ధిదారులు ఎంత మంది ఉన్నారో తెలుసుకునేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటికే 80 శాతానికిపైగా రేషన్ కార్డుదారులు ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేసినట్లు సమాచారం. జనవరి 31 లోగా రేషన్ దుకాణాలకు వెళ్లి ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు సూచించారు.