Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఊరట..

Telangana Goverment Logo

Telangana Goverment Logo

తెలంగాణలో ఉమ్మడి రాష్ట్ర కాలానికి చెందిన గృహ నిర్మాణ పథకాల లబ్ధిదారులకు ప్రజా ప్రభుత్వం ఊరట కల్పించింది. 2014కు ముందు ఇళ్ల పథకం కింద రుణాలు పొంది, వాటిని పూర్తిగా చెల్లించినప్పటికీ తనఖాలో ఉన్న ఇళ్ల పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లను లబ్ధిదారులకు వెనక్కి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గృహ నిర్మాణ పథకాల్లో భాగంగా ప్రభుత్వం అందించే సబ్సిడీతో పాటు, లబ్ధిదారుల వాటా, బ్యాంకు రుణాల ద్వారా నిధులను సమకూర్చేవారు. ఈ ప్రక్రియలో ఇళ్ల నిర్మాణాల కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న లబ్ధిదారులు తమ ఇళ్ల పట్టాలను సంబంధిత కార్యాలయాల్లో తనఖా పెట్టాల్సి వచ్చేది. అయితే, నిబంధనల ప్రకారం రుణ వాయిదాలన్నీ పూర్తిగా చెల్లించినప్పటికీ, వివిధ పరిపాలనా కారణాల వల్ల లక్షలాది మందికి సంబంధించిన అసలు పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లు తహసీల్దారు కార్యాలయాల్లోనే మూలుగుతూ వచ్చాయి.

ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన 22ఏ వివాదాలు, రెవెన్యూ శాఖకు సంబంధించిన కీలక సమీక్షా సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. దశాబ్ద కాలంగా తమ పట్టాలు చేతికి అందక కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ప్రజల ఇబ్బందిని ప్రభుత్వం గుర్తించింది. దశాబ్దాల నిరీక్షనకు తెరదించుతూ, పెండింగ్‌లో ఉన్న ఆ పత్రాలన్నింటినీ ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే లబ్ధిదారులకు తిరిగి అందజేయాలని జిల్లా కలెక్టర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ తాజా నిర్ణయం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.