Site icon NTV Telugu

Local Body Elections: నేడు తొలి విడత పంచాయతీ పోలింగ్..

Telangana Local Body Elections

Telangana Local Body Elections

Local Body Elections: తెలంగాణలో తొలి దశ గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 4,236 గ్రామపంచాయతీలలో ఎన్నికలు జరగాల్సి ఉండగా, 395 గ్రామాల్లో ఇప్పటికే సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐదు గ్రామాల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. దీంతో 3,834 గ్రామపంచాయతీలకు గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతోంది. 12,960 మంది సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యుల పదవుల కోసం 65,455 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సర్పంచ్ స్థానాలకు సగటున 3.38 మంది, వార్డు స్థానాలకు సగటున 2.36 మంది పోటీ పడుతున్నారు.

READ MORE: YS Viveka Case : వివేకా హత్య కేసు.. సీబీఐ కోర్టు సంచలన తీర్పు

వార్డు స్థాయిలో కూడా 37,440 స్థానాలలో 9,633 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 56,19,430 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు అర్హులు. అందులో 27,41,070 మంది పురుషులు, 28,78,159 మంది మహిళలు ఉన్నారు. మొత్తం 37,562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా, సమస్యాత్మకంగా గుర్తించిన 3,461 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగేందుకు 50 వేల మంది సివిల్ పోలీసులు, 60 ప్రత్యేక పోలీసు ప్లటూన్లు, అగ్నిమాపక, అటవీ సిబ్బంది సహా మొత్తం 70,000 మందికిపైగా సిబ్బందిని విధుల్లో ఉన్నారు. కాగా.. పోలింగ్ ముగిసిన వెంటనే మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. నేడే ఫలితాలు ప్రకటిస్తారు. అనంతరం ఫలితాలు ప్రకటించి ఉపసర్పంచి ఎన్నికలను నిర్వహించనున్నారు.

Exit mobile version