Site icon NTV Telugu

Fancy Numbers: ఫ్యాన్సీ నంబర్ల ప్రియులకు షాక్.. రెండురెట్లు ఫీజులు పెంపు!

Telangana Fancy Number

Telangana Fancy Number

Vehicles Fancy Number and Life Tax Fee Increases in Telangana: ఫ్యాన్సీ నంబర్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లక్కీ నంబర్ లేదా న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ను తీసుకోవాలని చాలా మంది భావిస్తుంటారు. అందరికంటే ప్రత్యేకంగా నిలబడాలని కూడా మరికొందరు కోరుకుంటారు. ఈ క్రమంలోనే ఫ్యాన్సీ నంబర్ల కోసం ఎంత ఖర్చయినా చేస్తారు. అలాంటి వారికి తెలంగాణ రవాణాశాఖ భారీ షాక్ ఇచ్చింది. ఫ్యాన్సీ నంబర్ల ఫీజులను రవాణాశాఖ భారీగా పెంచింది. ఆ డీటెయిల్స్ చూద్దాం.

ఫ్యాన్సీ నంబర్ల కోసం వాహనదారులు చెల్లించాల్సిన ఫీజులు భారీగా పెరిగాయి. ఇదివరకు ఐదు శ్లాబులుగా ఉండగా.. ఇప్పుడు ఏడుకు పెరిగాయి. గతంలో ఫ్యాన్సీ నంబర్ల కోసం రూ.50 వేలు ఉన్న ధర.. ఇప్పుడు రూ.1.50 లక్షలకు పెరిగింది. అంటే రెండురెట్లు ఫీజు పెరిగిందన్నమాట. అలానే రూ.40 వేలు ఉన్న ఫీజు లక్ష రూపాయలకు, రూ.30 వేలు ఉన్న ఫీజు యాభై వేలకి పెరిగింది. రూ.20 వేల ఫీజును రూ.40000కి.. రూ.10 వేల ఫీజును రూ.30000కి.. రూ.5వేల ఫీజును రూ.6000కి పెంచారు. దాంతో ఫ్యాన్సీ నంబర్లపై ఆసక్తి ఉన్నవారికి ఆర్థిక భారం మరింత పెరగనుంది. ఫ్యాన్సీ నంబర్ల వేలంలో రవాణా శాఖకు భారీగా ఆదాయం సమకూరనుంది.

Also Read: Crime News: మైలపోలు తీస్తుండగా పెళ్లి ఆపిన పోలీసులు.. ఆఖరి నిముషంలో ఏం జరిగిందంటే?

ఫ్యాన్సీ నంబర్ల ధరతో పాటుగా లైఫ్ ట్యాక్స్‌ను కూడా భారీగా పెంచుతూ రవాణాశాఖ జీవో విడుదల చేసింది. ఖరీదైన వాహనాలపై 1-6 శాతం వరకు పెంపు ఉండనుంది. ఇప్పటివరకు ద్విచక్ర వాహనాలకు రెండు శ్లాబులు ఉండగా.. ఇప్పుడు నాలుగు శ్లాబులుగా మారాయి. అయితే ఎక్స్-షోరూమ్ ధర రూ.లక్ష లోపు ఉంటే అదనపు భారం ఉండదు. పాత నిబంధనల ప్రకారమే లైఫ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఎక్స్-షోరూమ్ ధర రూ.లక్ష దాటితే అదనంగా 3 శాతం.. రూ. 2 లక్షలు దాటితే అదనంగా 6 శాతం లైఫ్ ట్యాక్స్ చెల్లించాలి. లక్ష దాటితే దాదాపుగా రూ.3,300 అదనపు భారం పడుతుంది. అలానే రూ.10 లక్షల లోపు ఎక్స్-షోరూమ్ ధర ఉన్న కార్లకు అదనపు భారం ఉండదు. రూ.20 లక్షలు దాటితే ఒక శాతం.. రూ.50 లక్షలు దాటితే రెండు శాతం అదనపు పన్ను కట్టాల్సి ఉంటుంది.

Exit mobile version