Site icon NTV Telugu

Lok Sabha Elections 2024: లోక్‌సభ పోలింగ్‌కు సిద్ధమైన తెలంగాణ.. ఓటింగ్‌పై ఆ ప్రభావం ఉంటుందా..?

Ts

Ts

Lok Sabha Elections 2024: తెలంగాణలో ప్రచార పర్వం ముగిసింది. ఇక 13న జరిగే పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు… సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్‌ కూడా జరుగుతుంది. రాష్ట్రంలో మొత్తం 3.32 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో సగానికి పైగా మహిళా ఓటర్లే ఉన్నారు. 17 పార్లమెంట్ నియోజకవర్గాలకుగాను 13 నియోజక వర్గాల్లో మహిళ ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35 వేల 809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్లలో ఎండలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేశారు. 9,900 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించిన ఎన్నికల సంఘం, అలాంటి ఏరియాల్లో ప్రత్యేక బలగాలతో నిఘా పెట్టింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరుగుతుంది.

106 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ ఉంటుంది. 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. తెలంగాణలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలను నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలుగా ఈసీ గుర్తించింది. అలాంటి ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరుగుతుంది.నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలైన ఆసిఫాబాద్‌, సిర్పూర్‌, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, భద్రాచలం, పినపాక, ఇల్లందు, అశ్వరావుపేట, కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో స్పెషల్ ఫోకస్ పెట్టారు. భారీ ఎత్తున భద్రతాదళాలను మోహరించారు. రాష్ట్ర పోలీసులతో పాటు ఎన్నికల విధుల్లో భాగంగా కేంద్రం నుంచి 175 కంపెనీలు విధుల్లో ఉంటాయి. 2.80 లక్షల మంది ఉద్యోగులు పోలింగ్ విధులు నిర్వహిస్తారు.

రాష్ట్రంలోని మొత్తం 3.32 కోట్ల మంది ఓటర్ల కోసం 35,809 పోలింగ్‌ కేంద్రాల్లో 1,09,941 బ్యాలెట్‌ యూనిట్లు, 50,135 వీవీ ప్యాట్‌లు, 44,906 కంట్రోల్‌ యూనిట్లు ఏర్పాటు చేశారు. 17 లోక్‌సభ నియోజక వర్గాల్లో 50 మంది మహిళలు సహా మొత్తం 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా హోమ్ ఓటింగ్‌ ముగిసింది. హోమ్ ఓటింగ్‌కు దరఖాస్తు చేసుకున్న 23,247 దివ్యాంగులతో పాటు 85 సంవత్సరాల వయసు పైబడిన వారికి ఇంటి దగ్గర ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించడంతో 21,651 మంది ఓట్లు వేశారు. ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసే సదుపాయాన్ని కల్పించడంతో 2,29,072 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 1,75,994 మంది ఓటు వేశారు. ఎలక్షన్‌ డ్యూటీ సర్టిఫికెట్‌ ద్వారా 34,973 మంది ఉద్యోగులు పోలింగ్‌ రోజున ఓటు వేయనున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చిందని తెలంగాణ డీజీపీ రవి గుప్తా తెలిపారు. పోలింగ్‌కు భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్నికల విధుల్లో 73,414 మంది సివిల్ పోలీసులు, 500 తెలంగాణ స్పెషల్ పోలీసు విభాగాలు ఉంటారన్నారు. ఎన్నికలకు 164 కేంద్ర బృందాలతో బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. తమిళనాడు నుంచి మూడు స్పెషల్ ఆర్మ్డ్ బృందాలు వచ్చాయన్నారు.

ఇక పోలింగ్ సమయంలో ఓటర్లు పలు సూచనలు పాటించాల్సి ఉంటుంది. పోలింగ్ స్టేషన్ల పరిధిలో సెక్షన్ 144 అమల్లో ఉన్నందున.. ఐదుగురికి మించి రోడ్డుపైకి రాకూడదు. మైక్రోఫోన్లు, స్పీకర్ల ద్వారా పాడటం, ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం నిషేధం. బహిరంగ ప్రదేశాల్లో షామియానాలు, పందిరి వంటి నిర్మాణాలకు అనుమతి లేదు. వ్యక్తులు, సంఘాల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టే ప్లకార్డులు, చిత్రాలు, సంకేతాలను ప్రదర్శించడం నిషేధం. అంతకంటే ముఖ్యంగా కర్రలు, తుపాకులు, మారణాయుధాలతో కూడిన జెండాలను పోలింగ్ కేంద్రాల నుంచి కిలో మీటరు దూరం వరకు తీసుకెళ్లకూడదు. ఆత్మ రక్షణ కోసం కర్రలు, తుపాకులు, మారణాయుధాలు వాడడం నిషేధం.

మరోవైపు పోలింగ్‌ రోజు అన్ని కంపెనీలు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని, నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలు ఉటాయని తెలంగాణ రాష్ట్ర ఎన్నిల ప్రధానాధికారి వికాస్‌ రాజ్‌ స్పష్టం చేశారు. పోలింగ్‌ సమయం దగ్గర పడినందున నిఘా మరింత పెరుగుతుందన్నారు. జూన్‌ 1న సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం ఉందన్నారు. బందోబస్తు కోసం రాష్ట్రానికి కేంద్ర బలగాలు వచ్చాయని, 60వేల మంది రాష్ట్ర పోలీసులు విధుల్లో ఉంటారని చెప్పారు. పార్టీల అభ్యర్థన మేరకు ఎన్నికల సంఘం పోలింగ్ సమయాన్ని ఒక గంట పాటు సాయంత్రం 6.00 గంటల వరకు పొడిగించింది ఈసీ. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Exit mobile version