EVM’s Not Working in Telangana State: తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. సాయంత్రం 5 గంటలకు వరకు కొనసాగనున్నది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. ఇప్పటికే పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి.
జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలోని 117వ బూత్‌లో ఈవీఎం మొరాయించింది. దీంతో క్యూలో ఉన్న ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు. పోలింగ్ ప్రారంభమై అర్ధ గంట దాటినా.. ఇప్పటివరకు అధికారులు పట్టించుకోవడం లేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలానే నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ 103 పోలింగ్ బూత్ వద్ద ఈవీఎం పనిచేయకపోవడంతో.. పోలింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు.
Also Read: Telangana Elections 2023: క్యూలో నిల్చొని.. ఓటు హక్కు వినియోగించుకున్న అల్లు అర్జున్!
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో బూతు నెంబర్ 20లో ఈవీఎం మొరాయించింది. దాంతో 30 నిమిషాలు ఆలస్యంగా ఓటింగ్ మొదలైంది. జోగులాంబ గద్వాల జిల్లా ఎంఏఎల్డి డిగ్రీ కాలేజీలోని పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మోరాయించగా.. ఎన్నికల సిబ్బంది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ బీఎస్‌ఎన్‌ఎల్ పోలింగ్ బూత్ 153లో ఈవీఎం మొరాయించింది. అధికారులు స్పందించి సరి చేస్తున్నారు.