NTV Telugu Site icon

Telangana Elections 2023: ఓటు వేయడానికి వెళుతున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Elections Precautions For Voters

Elections Precautions For Voters

These precautions are mandatory for voters: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పర్వం ముగిసింది. గురువారం (నవంబర్ 30) తెలంగాణలో పోలింగ్ డే. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం అందరూ సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓటు వేసే ప్రాసెస్ ఏంటి?, ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు ఓసారి తెలుసుకుందాం.

గుర్తింపు కార్డు తప్పనిసరి:
ఓటు వేయడానికి తప్పనిసరిగా ఫొటోతో కూడిన గుర్తింపు పత్రం ఉండాలి. లేకుంటే ఓటు వేయడానికి ఎన్నికల అధికారులు అనుమతించరు. ఎన్నికల సిబ్బంది ఇంటింటా పంపిణీ చేసే ఫొటోతో కూడిన ఓటరు చీటీ. కేవలం పోలింగ్‌ కేంద్రం, ఓటర్ల జాబితాలో క్రమ సంఖ్యతో కూడిన సమాచారం కోసం మాత్రమే. ఎన్నికల సంఘం సూచించిన 12 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి ఓటరు వెంట తప్పనిసరిగా ఉండాలి. ప్రత్యేక వైకల్యం కలిగిన దివ్యాంగులకు కేంద్ర న్యాయ సాధికారిత మంత్రిత్వ శాఖ జారీ చేసే యూనిక్‌ డిజిటల్‌ గుర్తింపు కార్డు ఉన్నా సరిపోతుంది.

ఎలా తెలుసుకోవాలి:
ఓటు వేయాలంటే పోలింగ్‌ కేంద్రం వద్ద ఓటరు జాబితాలో పేరు తప్పనిసరిగా నమోదై ఉండాలి. ఈ నేపథ్యంలో ముందుగా మీ ఓటు ఏ పోలింగ్‌ కేంద్రంలో ఉందో తెలుసుకోవాలి. అందుకోసం ఎలక్షన్ కమీషన్ వెబ్‌సైట్ లేదా సీవిజిల్ యాప్ అందుబాటులో ఉన్నాయి. ఇక ఓటు వేయడానికి వెళ్లేటప్పుడు తప్పకుండా కొన్ని రూల్స్ పాటించాలి. పోలింగ్‌ కేంద్రానికి వెళ్లేటప్పుడు గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి:
పోలింగ్ బూత్ లోపలికి సెల్‌ఫోన్లు, కెమెరా, లాప్ టాప్ వంటివి తీసుకెళ్లకూడదు. ఒకవేళ అక్రమంగా బూత్ లోపల సెల్ఫీ దిగే ప్రయత్నం చేస్తే.. అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అంతేకాదు మీ ఓటును లెక్కించరు. ఇక పోలింగ్‌ కేంద్రం దగ్గర పార్టీల గుర్తులు, రంగులు కలిగిన దుస్తులు, టోపీల వంటివి అస్సలు ధరించకూడదు.

అనుమతించిన పత్రాలు:
ఓటరు ఫొటో గుర్తింపు కార్డు
ఆధార్‌ కార్డు
ఉపాధిహామీ జాబ్‌కార్డు
ఫొటోతో కూడిన బ్యాంకు/తపాలా ఖాతా పుస్తకం
డ్రైవింగ్‌ లైసెన్సు
పాన్‌ కార్డు
కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసే ఆరోగ్య బీమా స్మార్టు కార్డు
ఎన్‌.పి.ఆర్‌. కింద ఆర్‌జీఐ జారీ చేసిన స్మార్ట్‌ కార్డు
భారతీయ పాస్‌పోర్టు
ఫొటోతో కూడిన పెన్షన్‌ డాక్యుమెంటు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జారీ చేసే ఫొటోతో కూడిన గుర్తింపు కార్డు
ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జారీ చేసే అధికారిక గుర్తింపు కార్డు