Site icon NTV Telugu

CM Revanth Reddy : సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన నిర్ణయం.. ఫ్యూచర్‌ సిటీ వరకు మెట్రో

Cm Revanth Reddy, Metro

Cm Revanth Reddy, Metro

CM Revanth Reddy : ఫ్యూచర్ సిటీ వరకు మెట్రోను విస్తరించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందుకు అవసరమైన తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మెట్రో విస్తరణపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సీఎంతో పాటు సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ముఖ్య కార్య‌ద‌ర్శి వి.శేషాద్రి, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి దాన కిశోర్‌, హైద‌రాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనల పురోగతిని ముఖ్యమంత్రి ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉందని, ఇప్పటికే ఢిల్లీలో అధికారులను కలిసి సంప్రదింపులు జరిపినట్లు అధికారులు వివరించారు.

హైద‌రాబాద్ మెట్రో రెండో ద‌శ విస్త‌ర‌ణ‌కు సంబంధించి నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు (36.8 కి.మీ.), రాయ‌దుర్గం-కోకాపేట నియోపొలిస్ (11.6 కి.మీ.), ఎంజీబీఎస్‌-చాంద్రాయ‌ణ‌గుట్ట (7.5 కి.మీ.), మియాపూర్‌-ప‌టాన్‌చెరు (13.4 కి.మీ.), ఎల్‌బీ న‌గ‌ర్‌-హ‌య‌త్ న‌గ‌ర్ (7.1 కి.మీ.) మొత్తం 76.4 కి.మీ.ల విస్తరణకు రూ.24269 కోట్ల అంచనాలతో డీపీఆర్ను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్ర‌భుత్వం చెరిసగం నిధులు భరించేలా జాయింట్ వెంచ‌ర్‌గా ఈ ప్రాజెక్టు చేపట్టేలా ప్రతిపాదనలు తయారు చేసింది. కేంద్రం నుంచి అనుమతులు సాధించేందుకు నిరంతరం ప్రయత్నించాలని, అనుమతులు రాగానే పనులు ప్రారంభించేందుకు సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

ఎయిర్ పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్ డెవెలప్మెంట్ యూనివర్సిటీ వరకు 40 కిలోమీటర్ల మేరకు మెట్రో విస్తరించేందుకు కొత్త ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దాదాపు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తు నగర విస్తరణ అవసరాల దృష్ట్యా మెట్రోను మీర్ఖాన్పేట వరకు పొడిగించాలని చెప్పారు. అందుకు అవసరమయ్యే అంచనాలతో డీపీఆర్ తయారు చేసి కేంద్రానికి పంపించాలని సూచించారు. హెచ్ఎండీఏతో పాటు ఎఫ్ఎస్డీఏ ను (ఫ్యూచర్ సిటీ డెవెలప్​మెంట్​ అథారిటీ)ని ఈ రూట్ మెట్రో విస్తరణలో భాగస్వామ్యులను చేయాలని చెప్పారు.

Stock Market: అమెరికా ప్రకటనతో భారీ లాభాలలో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్స్

Exit mobile version