Site icon NTV Telugu

Revanth Reddy: సింగపూర్‌ విదేశాంగ మంత్రితో సీఎం రేవంత్‌ భేటీ!

Revanth Reddy

Revanth Reddy

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి సింగపూర్‌లో పర్యటిస్తున్నారు. గురువారం రాత్రి సింగపూర్‌ చేరుకున్న సీఎం.. ఈరోజు ఉదయం ఆ దేశ విదేశాంగ మంత్రి వివియన్‌ బాలకృష్ణన్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో సీఎంతో పాటు మంత్రి శ్రీధర్‌ బాబు, ఐటీ అండ్ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూసీ పునరుజ్జీవనం, గ్రీన్‌ ఎనర్జీ, పర్యాటకం, ఐటీ, విద్య, నైపుణ్య నిర్మాణంపై చర్చించారు.

ఈ సమావేశంలో సింగపూర్‌లోని అభివృద్ధి పనులతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ప్రణాళికలపై వివియన్‌ బాలకృష్ణన్‌, సీఎం రేవంత్‌ రెడ్డి ప్రధానంగా చర్చించారు. సింగపూర్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులు, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అంశాలను పోల్చి చూశారు. క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీ పాలసీ, దాని అవకాశాలపై చర్చించారు. అలానే నిధుల సమీకరణ గురించి చర్చ జరిపారు. సీఎం బృందం శని, ఆదివారాల్లో కూడా సింగపూర్‌లోనే పర్యటించనుంది. స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు నేపథ్యంలో సింగపూర్‌లోని కోర్సులు, ప్రణాళికలు, నిర్వహణను పరిశీలించనున్నారు. అలానే సింగపూర్‌లోని పారిశ్రామిక వేత్తలతో సీఎం భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై వారితో చర్చించనున్నారు.

Exit mobile version