Site icon NTV Telugu

Revanth Reddy: ఒక్క నెల ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేయండి.. వైద్యులకు సీఎం విజ్ఞప్తి!

Aig Hospitals Revanth Reddy

Aig Hospitals Revanth Reddy

ఏడాదిలో ఏదో ఒక్క నెల ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేయండని వైద్యులకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. విదేశాల్లో ఉండే వైద్యులు కూడా అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తున్నారని, వారు నిమ్స్ లాంటి ఆసుపత్రుల్లో సేవ చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రైవేట్‌కు ధీటుగా ఆసుపత్రులను సిద్ధం చేస్తాం అని, త్వరలో 25 ఆస్పత్రులు అందుబాటులోకి వస్తాయని సీఎం తెలిపారు. బంజారాహిల్స్‌‌లో ఏఐజీ ఆస్పత్రిని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలకు రెండో అతిపెద్ద ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకొచ్చినందుకు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డిని అభినందించారు.

‘ప్రజలకు రెండో అతిపెద్ద ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకొచ్చిన డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి అభినందనలు. తెలంగాణ, హైదరాబాద్‌కు నాగేశ్వర్ రెడ్డి గొప్ప పేరు తీసుకొచ్చారు. ఆయన సేవలను గుర్తించి కేంద్రప్రభుత్వం పద్మవిభూషణ్ ఇచ్చింది. నాగేశ్వర్ రెడ్డి భారతరత్నకు అర్హులు. ఆయనకు భారతరత్న వచ్చేలా తెలంగాణ నుంచి నా వంతు ప్రయత్నం చేస్తా. 66 దేశాల నుంచి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స‌కు రావడం మనకు గర్వకారణం. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నాం. అందులో హెల్త్ టూరిజం ఒక చాప్టర్‌గా ఉంటుంది.హైదరాబాద్‌ను హెల్త్ టూరిజం హబ్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read: Sigachi Blast: మృతుల కుటుంబాలకు కోటి ఎక్స్‌గ్రేషియా.. 90 రోజులు కంపెనీ మూసివేత!

‘రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మాణంలో ఉన్నాయి. కార్పొరేట్ ఆసుపత్రులతో పోటీపడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందిస్తాం. త్వరలో 25 ఆస్పత్రులు అందుబాటులోకి వస్తున్నాయి. వైద్యులకు నా విజ్ఞప్తి, ఏడాదిలో ఒక్క నెల ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేయండి. విదేశాల్లో ఉండే వైద్యులు కూడా అప్పుడప్పుడు ఇక్కడికి వస్తున్నారు. వాళ్లు కూడా నిమ్స్ లాంటి ఆస్పత్రుల్లో సేవ చేసేలా ఏర్పాట్లు చేయండి. వైద్య విద్య చదివిన వాళ్లకు విజ్ఞప్తి, ఒక్క నెల ఏదో ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో సేవ చేయండి. విద్యా వైద్యంకి ఎక్కువ నిధులు కేటాయిస్తున్నాం. పేదలకు ఉచిత వైద్యం, నాణ్యమైన విద్య అందించాలనే ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాం. వైద్య రంగం అభివృద్ధికి రూ.11500 కోట్లు, రూ.21500 కోట్లు విద్యా రంగం అభివృద్ధికి కేటాయించాం’ అని సీఎం రేవంత్ చెప్పారు.

Exit mobile version