Telangana Rice Mill Scam: రైస్ మిల్లర్ల ‘మాయా’జాలం.. ఖజానాకు భారీ గండి!

Cid Rice Mill

Cid Rice Mill

Telangana Rice Mill Scam: రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రభుత్వ ఆదాయానికి భారీ ఎత్తున గండి కొడుతున్న అక్రమ రైస్ మిల్లర్లపై నేర పరిశోధన విభాగం (సీఐడీ) కొరడా ఝుళిపించింది. వేల టన్నుల ప్రభుత్వ ధాన్యాన్ని రీసైక్లింగ్ చేస్తూ, పక్కదారి పట్టిస్తున్న వ్యవహారంపై ఏకకాలంలో రాష్ట్రవ్యాప్త సోదాలు చేపట్టింది. ఈ భారీ కుంభకోణంలో ఇప్పటికే 16 మంది రైస్ మిల్లర్లను అధికారులు అరెస్ట్ చేయగా, పలువురిని అదుపులోకి తీసుకుని ముమ్మరంగా విచారిస్తున్నారు. మిల్లర్ల దగాతో ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.96 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

రైతుల నుంచి ప్రభుత్వం సేకరించి కస్టమ్ మిల్లింగ్ (సీఎంఆర్) కింద అప్పగించిన ధాన్యాన్ని కొందరు మిల్లర్లు భారీ ఎత్తున స్వాహా చేశారు. పేద ప్రజలకు పంపిణీ చేయాల్సిన నాణ్యమైన సన్న బియ్యం స్థానంలో, బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు దొరికే నాసిరకం దొడ్డు బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించి చేతులు దులుపుకున్నారు. అసలైన ప్రభుత్వ సన్న బియ్యాన్ని, ధాన్యాన్ని అక్రమ మార్గాల్లో పక్కదారి పట్టించి కాట్రేకర్లు, ఇతర రాష్ట్రాల వ్యాపారులకు విక్రయించి కోట్లాది రూపాయలు కొల్లగొట్టినట్లు అధికారులు గుర్తించారు.

రాష్ట్రంలో సీఎంఆర్ బియ్యం లెక్కల్లో భారీ తేడాలు రావడంతో పౌరసరఫరాల శాఖ (సివిల్ సప్లైస్) అంతర్గత విచారణ చేపట్టింది. క్షేత్రస్థాయి పరిశీలనలో భారీ అక్రమాలు వెలుగుచూడటంతో, పూర్తి ఆధారాలతో కూడిన సమగ్ర నివేదికను సీఐడీ విభాగానికి సమర్పించి అధికారికంగా ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్, రంగారెడ్డి, ములుగు, మెదక్ జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలోని పలు మిల్లులు, కార్యాలయాలు, నివాసాలపై ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో వేలాది టన్నుల ధాన్యం నిల్వల్లో తేడాలు ఉన్నట్లు నిర్ధారించిన అధికారులు, నకిలీ వేబిల్లులు, రిజిస్టర్లు మరియు కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమాలకు పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలు లభించడంతో 16 మందిని తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ అక్రమ నెట్‌వర్క్‌లో మిల్లర్లతో పాటు కుమ్మక్కైన అధికారులు, దళారుల పాత్రపైనా సీఐడీ కూపీ లాగుతోంది. ఈ వ్యవహారంలో మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.