Cheyutha Pensions: చేయూత పెన్షన్లు, ఇందిరమ్మ చీరల పంపిణీకి తేదీ ఫిక్స్‌..

Cheyuta Pensions

Cheyuta Pensions

Cheyutha Pensions: తెలంగాణలో కొత్త చేయూత పెన్షన్లు, ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాలకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క ప్రకటించారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 26న రాష్ట్రవ్యాప్తంగా 4,63,857 మంది కొత్త లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో చేయూత పెన్షన్ మొత్తాన్ని నేరుగా జమ చేయనున్నట్లు తెలిపారు. అదే రోజు కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు.

రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన సామాజిక న్యాయం, సమానత్వం, గౌరవప్రదమైన జీవనం అనే స్ఫూర్తికి అనుగుణంగా ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. సమాజంలో ఆర్థికంగా అండ అవసరమైన వారికి భద్రత కల్పించడం, మహిళలకు ఆత్మగౌరవం అందించడం తమ ప్రభుత్వ సంక్షేమ విధానంలో కీలక భాగమని అన్నారు. కొత్తగా మంజూరయ్యే 4,63,857 చేయూత పెన్షన్ల ద్వారా వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు తదితర అర్హులైన కుటుంబాలకు నెలవారీ ఆర్థిక భరోసా లభిస్తుందని తెలిపారు. పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న అర్హులకు నవంబర్ 26 నుంచే ప్రయోజనం అందేలా చర్యలు తీసుకున్నామని, ఇది ప్రభుత్వం కల్పిస్తున్న సామాజిక భద్రతకు నిదర్శనమని చెప్పారు.

ఇక తెలంగాణ ఆడబిడ్డలకు చీర అంటే కేవలం ఒక వస్త్రం మాత్రమే కాదని, అది పుట్టింటి ఆత్మీయతకు, గౌరవానికి ప్రతీక అని మంత్రి సీతక్క అభివర్ణించారు. ఆడబిడ్డను గౌరవించే తెలంగాణ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలను అందిస్తున్నామని తెలిపారు. కేవలం చీరల పంపిణీకే పరిమితం కాకుండా, ‘మహిళా ఉన్నతి–తెలంగాణ ప్రగతి’ లక్ష్యంతో స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలు, ఉపాధి, వ్యాపార అవకాశాలు, మార్కెట్ సదుపాయాలు కల్పిస్తూ వారిని ఆర్థికంగా స్వావలంబులుగా తీర్చిదిద్దుతున్నామని వివరించారు. నవంబర్ 26న ఒకే వేదికగా చేయూత పెన్షన్లు, ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం కావడం ద్వారా ప్రభుత్వం తన పాలనా దృక్పథాన్ని చాటుతోందని, భవిష్యత్తులోనూ మహిళల ఆర్థిక ఎదుగుదలకు మరిన్ని కార్యక్రమాలు కొనసాగిస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.