Betting Apps: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసులో దర్యాప్తు తుది దశకు చేరుకుంది. ఈ వ్యవహారంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీల పాత్రపై దృష్టి సారించిన సీఐడీ (CID) అధికారులు, తాజాగా కీలక విచారణను పూర్తి చేశారు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశారనే ఆరోపణలతో టీవీ నటి రీతూ చౌదరి, సోషల్ మీడియా సెలబ్రిటీ భయ్యా సన్నీ యాదవ్‌లను సీఐడీ పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. దాదాపు రెండు గంటలకు పైగా సాగిన ఈ విచారణలో వీరిద్దరి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. యాప్స్ నిర్వాహకులతో వీరికి ఉన్న ఒప్పందాలు, ప్రమోషన్ల కోసం తీసుకున్న పారితోషికం వంటి అంశాలపై అధికారులు ఆరా తీశారు.
కేవలం వీరిద్దరే కాకుండా, ఈ కేసులో మొత్తం 25 మంది సెలబ్రిటీలు మరియు ఇన్ఫ్లుయెన్సర్లపై సీఐడీ కేసులు నమోదు చేసింది. ఇప్పటికే వీరందరినీ పిలిపించి స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. ఒక్కో సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా ఎంత మొత్తంలో డబ్బు తీసుకున్నారనేది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ప్రమోషన్ల ద్వారా లక్షలాది రూపాయలు వీరి ఖాతాల్లోకి చేరినట్లు సీఐడీ గుర్తించింది. సెలబ్రిటీలు ఇచ్చిన వివరాలను వారి బ్యాంక్ లావాదేవీలతో సరిపోల్చి చూస్తున్నారు. ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చింది? విదేశీ లింకులు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలోనూ తనిఖీలు సాగుతున్నాయి.
వివిధ ప్రాంతాల్లో నమోదైన ఎఫ్ఐఆర్ (FIR)లను ఆధారంగా చేసుకుని తెలంగాణ సీఐడీ ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తోంది. 25 మంది ఇచ్చిన వాంగ్మూలాలు, సేకరించిన సాక్ష్యాల ఆధారంగా అధికారులు త్వరలోనే ఫైనల్ రిపోర్టును సిద్ధం చేయనున్నారు. సామాన్య ప్రజలను, ముఖ్యంగా యువతను తప్పుదోవ పట్టించేలా ఉన్న ఈ బెట్టింగ్ ప్రమోషన్ల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ నివేదిక ఆధారంగా ఈ కేసులో తదుపరి అరెస్టులు లేదా కఠిన చర్యలు ఉండే అవకాశం కనిపిస్తోంది.
