Site icon NTV Telugu

Bathukamma Guinness Record: తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు

Telangana Bathukamma

Telangana Bathukamma

Bathukamma Guinness Record: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సరూర్‌నగర్‌ మైదానంలో నిర్వహించిన బతుకమ్మ కార్యక్రమం రెండు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులు సాధించింది. గిన్నిస్‌ రికార్డు సాధనే లక్ష్యంగా సరూర్‌నగర్‌ స్టేడియంలో సోమవారం బతుకమ్మ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా 63 అడుగుల భారీ బతుకమ్మ ఏర్పాటు చేశారు. ఒకేసారి 1354 మంది మహిళలతో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. మన తెలంగాణ బతుకమ్మ రెండు విభాగాల్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం సంపాదించుకుంది. అతిపెద్ద బతుకమ్మగా, అతిపెద్ద జానపద నృత్యంగా గిన్నిస్ రికార్డు సృష్టించింది. కార్యక్రమానికి మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి తదితరులు హాజరయ్యారు. భారీ బతుకమ్మ చుట్టూ మహిళలు లయబద్ధంగా బతుకమ్మ ఆడారు.

బతుకమ్మను గత వెయ్యేళ్లుగా తెలంగాణా ప్రజలు తమ ఇంటి దేవతగా పూజిస్తున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ‘బతుకమ్మ’ పండుగను భాద్రపదమాసం అమావాస్య నుంచి తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. సద్దుల పండుగ పండుగను ప్రతి ఏటా దసరాకి రెండు రోజుల ముందు నిర్వహిస్తారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. ఆడబిడ్డలందరూ రంగు రంగుల పూలను బతుకమ్మలా పేర్చి చుట్టూ చప్పట్లు కొడుతూ ఒక లయతో తిరుగుతూ బతుకమ్మ పాటలను పాడతారు. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ.. ఇలా దేని ప్రత్యేకత దానిదే..

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళల కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు కనిపిస్తాయి. బతుకమ్మ పాటల్లో ఎన్నో చరిత్రలు, పురాణాలు మేళవిస్తారు. ఎన్నో చారిత్రక పాటలు పాడుతారు. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి. నవాబులు, భూస్వాముల పెత్తందారీ తనంలో నలిగిపోతున్న తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. వారి అకృత్యాలకు నలిగిపోయిన వారిని, తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నవారిని తలచుకొని తోటి మహిళలు విచారించేవారు. వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకవమ్మా లేదా బతుకు అమ్మా అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు. “బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో” పాటల వెనుక ఉండే మర్మం ఇదేనని పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

READ ALSO: Avika Gor : అవికాగోర్ మెహందీ వేడుక.. మొదలైన పెళ్లి సందడి

Exit mobile version