Site icon NTV Telugu

Aarogyasri Scheme: ప్రజలకు బిగ్ అలర్ట్.. ఆగస్ట్ 31 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్!

Telangana Aarogyasri Scheme

Telangana Aarogyasri Scheme

Aarogyasri Services To Stop From August 31: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. పేద ప్రజల ఆరోగ్యానికి అండగా నిలిచే ‘ఆరోగ్యశ్రీ’ సేవలు అతి త్వరలో నిలిచిపోనున్నాయి. ఆగస్ట్ 31 అర్థరాత్రి నుంచి ప్రైవేట్ ఆసుపత్రులలో ఆరోగ్రశ్రీ సేవలు బంద్ కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ (టీఏఎన్‌హెచ్‌ఏ) ఓ ప్రకటన చేసింది. బకాయిల చెల్లింపులో జాప్యం, ఆర్థిక భారం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీఏఎన్‌హెచ్‌ఏ తెలిపింది. గురువారం ఆరోగ్యశ్రీ సీఈవోకు టీఏఎన్‌హెచ్‌ఏ లేఖ రాసింది. జనవరిలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే రూ.1300-1400 కోట్ల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది.

బకాయిల చెల్లింపులు గణనీయంగా పెరగడంతో కొన్ని చిన్నఆస్పత్రులను మూసివేయాల్సిన పరిస్థితి నెలకొందని టీఏఎన్‌హెచ్‌ఏ అధ్యక్షుడు వడ్డిరాజు రాకేష్‌ తెలిపారు. గత జనవరిలో ప్రభుత్వం 4-5 నెలల్లో బకాయిలను చెల్లిస్తామని హామీ ఇచ్చిందని, ప్యాకేజీలను కూడా సవరిస్తామని చెప్పిందని, ఆరు నెలలు గడిచినా అమలుకు నోచుకోలేదని రాకేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిలు వెంటనే చెల్లింపులు చేయాలని, ఆరోగ్యశ్రీ ప్యాకేజీలలో సవరణ చేయాలని టీఏఎన్‌హెచ్‌ఏ డిమాండ్ చేస్తోంది. ఆర్థిక భారాన్ని భరించలేక వైద్యులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నాం అని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా 471 ప్రైవేట్ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ఉన్నాయని.. రూ.1300 నుంచి 1400 కోట్ల బకాయిలు ఉన్నట్టు తెలిపింది.

Also Read: Kamareddy Crime News: పురుషులతో పురుషులకే వల.. కామారెడ్డిలో వెలుగులోకి ముఠా ఆగడాలు!

ఆరోగ్యశ్రీ బకాయిల పెండింగ్ అంశం గురించి గతంలోనే టీఏఎన్‌హెచ్‌ఏ హెచ్చరికలు జారీ చేసింది. అప్పుడు ప్రభుత్వం హామీలు అయితే ఇచ్చింది కానీ.. టీఏఎన్‌హెచ్‌ఏ హెచ్చరికలను సీరియస్‌గా పట్టించుకోలేదు. ఇన్ని రోజులు పెండింగ్ బిల్లుల కోసం వేచి చూశారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆగస్టు 31 నుంచి ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని టీఏఎన్‌హెచ్‌ఏ నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీతో పాటు జర్నలిస్టులు, ఉద్యోగుల హెల్త్ స్కీమ్స్‌ కూడా నిలిచిపోనున్నాయని తెలుస్తోంది.

Exit mobile version