NTV Telugu Site icon

Atrocious: చిన్నారి పళ్లు విరగొట్టి, నేలకేసి కొట్టి చంపిన తాంత్రికుడు

Child Deaths

Child Deaths

Atrocious: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. సాంకేతికంగా ఎంతగా ముందుకు వెళ్తున్నప్పటికీ గ్రామాల్లోని అనేకమంది ఇప్పటికీ సంప్రదాయ వైద్యంపై ఆధారపడుతున్నారు. దేశంలో దాదాపు 10 లక్షల మంది అల్లోపతి వైద్యాన్ని అభ్యసిస్తున్నారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అంచనా వేసింది. తాజాగా అభం శుభం తెలియని చిన్నారి ఈ వైద్యం పేరుతో బలయ్యాడు.. బులంద్‌ షహర్‌ జిల్లాలోని ధకర్‌ గ్రామంలో అనూజ్‌ అనే ఏడాది బాలుడు అనారోగ్యం బారినపడ్డాడు. దాంతో కుటుంబసభ్యులు అతడిని స్థానికంగా ఉన్న ఓ మంత్రగాడి దగ్గరికి తీసుకెళ్లారు. బాలుడిని బాగుచేసే పేరుతో ఆ మంత్రగాడు అతడిని నేలకేసి కొట్టాడు. అంతేగాక, బాలుడి నోట్లోని పళ్లను విరగ్గొట్టాడు. దాంతో ఆ పసిబిడ్డ అపస్మారక స్థితిలో వెళ్లిపోయాడు.

Read Also: Shocking: తన అంత్యక్రియలను తానే చేసుకున్న వృద్ధుడు

ఇది గమనించి కుటుంబసభ్యులు అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అతడు అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. దాంతో బాధిత కుటుంబం బాలుడి భౌతికకాయాన్ని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి నిందితుడిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. దాంతో ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, బులంద్‌షహర్‌ జిల్లాలో ఆరోగ్య కేంద్రాలు సరిపడా లేవని, ఉన్న ఆరోగ్య కేంద్రాల్లో కూడా డాక్టర్లు అందుబాటులో ఉండరని, ప్రైవేటు క్లినిక్‌లకు వెళ్లాలంటే పేదలకు మోయలేని ఆర్థిక భారమని.. అందుకే ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకపోతే మంత్రగాళ్లను ఆశ్రయిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్‌లో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. మూడు నెలల బాలిక అనారోగ్యాన్ని నయం చేసే పేరుతో ఓ మంత్రగాడు ఇనుప చువ్వను కాల్చి 51 సార్లు కడుపుపై గుచ్చి చంపాడు.