NTV Telugu Site icon

IND vs NZ: కివీస్‌పై ఓటమి.. గంభీర్ కీలక నిర్ణయం

Rohit Sharma Gambhir

Rohit Sharma Gambhir

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా ఘోర ఓటమిని చవి చూసింది. దీంతో.. భారత్‌ సిరీస్‌ కోల్పోయింది. అంతేకాకుండా.. సొంతగడ్డపై టెస్టుల్లో వరుసగా 18 సిరీస్‌ల విజయాల భారత్‌ విజయోత్సవ ప్రచారానికి తెరపడింది. ఈ పరాజయం డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను తీవ్రంగా దెబ్బతీసింది. డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు చేరాలంటే మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లో భారత్ కనీసం నాలుగింట్లో నెగ్గాల్సి ఉంది. అప్పుడే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా టైటిల్ పోరుకు అర్హత సాధిస్తుంది. ఈ క్రమంలో.. టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read Also: Israel Iran: ఇరాన్ ఆయువుపట్టుపై దెబ్బకొట్టిన ఇజ్రాయిల్..

ఆప్షనల్ ట్రైనింగ్ సెషన్‌ను రద్దు చేసినట్లు సమాచారం. అయితే.. న్యూజిలాండ్‌తో జరిగే మూడో టెస్టుకు మాత్రమేనా, లేదా పూర్తిగా రద్దు చేశాడా అనేది క్లారిటీ లేదు. ప్రాక్టీసుకు స్టార్ ఆటగాళ్లకు మినహాయింపు ఇవ్వడమే ఆప్షనల్ ట్రైనింగ్ సెషన్. వ్యక్తిగత పనుల కోసం లేదా ప్రాక్టీస్‌లో గాయపడతారనే ఉద్దేశంతో స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇస్తుంటారు. ఇకపై వాళ్లకు ఆ ఛాన్స్ లేదు. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఓటమి అనంతరం టీమిండియా బ్యాట్స్‌మెన్ల బలహీనతలు ఒక్కసారిగా బయటికొచ్చాయి. స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మతో సహా స్పిన్‌కు తడబడ్డారు. ఈ క్రమంలో బ్యాటర్లకు స్పిన్ ప్రాక్టీస్‌కు ప్రత్యేక సెషన్ గంభీర్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు న్యూజిలాండ్ బ్యాటర్ల కోసం గంభీర్ ప్రత్యేక వ్యూహాలతో బౌలర్లతో సాధన చేయిస్తున్నాడు. భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడో మ్యాచ్ నవంబర్ 1 నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది.

Read Also: Gold Prices: ఏడాదిలో 35 సార్లు ఆల్ టైమ్ హైకి చేరుకున్న బంగారం ధర..