INDW vs AUSW T-20 World Cup Semi Final: మహిళల టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో టీమిండియా వెనుదిరిగింది. సెమీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చేసిన పోరాటం వృథా అయింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ 34 బంతుల్లోనే 52 పరుగులు చేసి భారత్ గట్టెక్కించాలని ప్రయత్నించింది. కానీ భారత్‌కు నిరాశ తప్పలేదు. మరో బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ 49 పరుగులతో అదరగొట్టింది. వీరిద్దరు క్రీజులో ఉన్నంతవరకు భారత్‌దే విజయం అనుకున్నారంటే అతిశయోక్తి లేదు. వీరు వెనుదిరిగిన అనంతరం అభిమానులను నిరాశ నిస్పృహలు ఆవరించాయి. భారత్ టీ-20 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరకుండానే వెనుదిరగడంతో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Gun Fire: ఆటలో ఓడిపోయినందుకు తనను చూసి నవ్వారని.. ఏడుగురిని చంపేశాడు!
కేప్‌టౌన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు ఆరంభం నుంచి దూకుడుగా ఆడింది. మొదట అద్భుతంగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ భారత జట్టు ముందు భారీ లక్ష్యం నిలిపింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. బెత్ మూనీ అర్ధశతకంతో రాణించింది. సారథి మెగ్ లానింగ్ 49 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. వికెట్ కీపర్ అలిసా హీలీ 25, ఆష్లే గార్డ్నర్ 31 పరుగులతో రాణించారు. భారత స్టార్ బౌలర్ రేణుకా సింగ్ తీవ్రంగా నిరాశపర్చింది. నాలుగు ఓవర్లలో 41 పరుగులు సమర్పించుకుంది. శిఖా పాండే రెండు వికెట్లు… దీప్తి శర్మ, రాధా యాదవ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియా 167 పరుగులకే పరిమితమైంది. దీంతో మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు ఆసీస్ చేరుకుంది.