సార్వత్రిక ఎన్నికల వేళ యూపీలో నోట్ల కట్టల వ్యవహారం కలకలం రేపుతోంది. ఇటీవలే జార్ఖండ్‌లో మంత్రి పీఏ ఇంట్లో భారీగా నగదు ప్రత్యక్షం కావడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు నిర్వహించిన దాడుల్లో రూ.100 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. రెండ్రోజుల నుంచి ఓ చెప్పుల వ్యాపారి ఇంట్లో ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. వాటిని లెక్కించడానికి మెషీన్లు కూడా మొరాయించాయి. భారీగా నగదుతో పాటు ఆస్తి పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: Bank Holidays : జూన్ లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా?
వ్యాపారుల ఇళ్లల్లో మంచాలు, అల్మారాలు, బ్యాగులు, షూ బాక్సుల్లో 500 రూపాయల నోట్ల కట్టల్లో లభ్యమయ్యాయి. సోదాల్లో బయటపడ్డ నోట్ల కట్టలను చూసి అధికారులు కూడా కంగుతిన్నారు. చెప్పుల వ్యాపారుల ఇళ్లల్లో ఏ మూలన చూసినా నోట్ల కట్టలే ప్రత్యక్షమయ్యాయి. నోట్లు లెక్కించలేక యంత్రాలే ఇబ్బందిపడ్డాయి. డబ్బుల కట్టలతో పాటు ఆక్రమార్జనకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా అధికారులు సీజ్ చేశారు. కేవలం 42 గంటల్లోనే రూ.100 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: Kanhaiya Kumar: కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్‌పై సిరా విసిరిన నిందితుడు అరెస్ట్..
ఆగ్రాలోని ముగ్గురు చెప్పుల వ్యాపారులకు చెందిన 14 ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించారు. రెండు రోజుల పాటు సాగిన సోదాల్లో కోట్ల కొద్దీ డబ్బును అధికారులు గుర్తించారు. వ్యాపారుల ఇళ్లల్లో డబ్బుతో పాటు బంగారు, వెండి ఆభరణాలను కోట్లాది రూపాయల విలువ చేసే స్థలాల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమాస్తులు లెక్క ఇప్పటివరకూ రూ.100 కోట్లు తేలిందని ఆదాయపు పన్ను శాఖ వర్గాలు తెలిపాయి. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని కూడా వెల్లడించాయి.
రెండు రోజుల క్రితం సోదాలు ప్రారంభమవ్వగా.. ఇప్పటికీ నగదును లెక్కిస్తూనే ఉన్నారు. మంచంపై రూ. 500 నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. వాషింగ్ మెషీన్, గోడల్లోని రహస్య ప్రదేశాల్లో భారీగా డబ్బులు గుర్తించినట్లు తెలుస్తోంది. నోట్లు లెక్కించే యంత్రాలు వేడెక్కడం వల్ల ఇతర యంత్రాలను తెప్పించారు. చెప్పుల వ్యాపారి రామ్‌నాథ్‌డాంగ్ ఇంటి నుంచి ఐటీ బృందం ఆదాయానికి మించిన ఆస్తులతో పాటు బినామీ ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకుంది. కొంతకాలంగా బీకే షూస్, మన్షు ఫుట్‌వేర్‌లో పన్ను ఎగవేతలకు పాల్పడుతున్నారని ఆదాయపు పన్నుశాఖకు ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులతో ఐటీ శాఖ సోదాలు చేసింది. భూమి, బంగారంపై పెట్టుబడులకు సంబంధించిన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. నోట్ల కట్టల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి పట్ల సంతాపం తెలిపిన భారత్..
