Site icon NTV Telugu

Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం!

Road Accident

Road Accident

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున కరూర్ జిల్లా కుళితలైలో కరూర్-తిరుచ్చి జాతీయ రహదారిపై బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా కాలిపోయింది. కారులోని ఐదుగురు సజీవదహనమయ్యారు. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. సమాచారం అందుకున్న ముసిరి పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ సిబ్బంది దాదాపు గంట పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు.

మంటలను ఆర్పిన అనంతరం మృతదేహాలను కారులో నుంచి బయటకు తీశారు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో కరూర్-తిరుచ్చి జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అరంతంగి నుంచి తిరుపూర్ వెళ్తున్న ప్రభుత్వ బస్సును కారు ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

తమిళనాడులోనే మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కడలూరు వేపూర్‌ హైవేలో అకస్మాత్తుగా లారీ ఆగింది. ఒక్కసారిగా లారీ ఆగడంతో వెనుక వస్తున్న నాలుగు బస్సులు ఒకదానికి ఒకటి వెనుక నుండి ఢీ‌‌కొన్నాయి. ఈ ఘటనలో బస్సుల ముందు, వెనుక భాగాలు ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదంలో 45 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా.. మరికొందరికి స్వల్ప గాయాలు‌‌ అయ్యాయి. గాయపడిన వారిని కడలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Exit mobile version