TVK: కర్ణాటకలో కుదిరినప్పుడు.. తమిళనాడులో ఎందుకు కుదరదు.. గవర్నర్‌పై ఆగ్రహంతో టీవీకే కార్యకర్తలు..

Tvk Vijay

Tvk Vijay

తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ‘గవర్నర్ గేమ్’ హాట్ టాపిక్ అయింది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ నిరాకరించడం ఇప్పుడు పెను దుమారానికి దారితీసింది. మద్దతు లేఖలతో విజయ్ గవర్నర్‌ను కలిసినా, మెజారిటీ నిరూపించుకోవాలని షరతులు విధించడం వెనుక రాజకీయ కుట్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా TVK కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు.

కార్యకర్తల అనుమానాలు..
టీవీకే శ్రేణులు ప్రధానంగా 2018 నాటి కర్ణాటక పరిణామాలను ఉదహరిస్తున్నారు. అప్పట్లో కర్ణాటకలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోయినా, 104 సీట్లు సాధించిన బీజేపీని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గుర్తించి గవర్నర్ వాజుభాయ్ వాలా యడియూరప్పతో ప్రమాణ స్వీకారం చేయించారు. కానీ తమిళనాడులో 108 సీట్లు వచ్చి, కాంగ్రెస్ (5 సీట్లు) మద్దతు ప్రకటించినా గవర్నర్ ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఇది ముమ్మాటికీ బీజేపీ ఆడుతున్న రాజకీయ క్రీడ అని, విజయ్ ఎదుగుదలను అడ్డుకోవడానికే గవర్నర్ కార్యాలయాన్ని పావుగా వాడుకుంటున్నారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

అసలేం జరుగుతోంది?
రాజకీయ కోణంలో చూస్తే.. టీవీకేకు కాంగ్రెస్ మద్దతు లభించినా సంఖ్యా బలం 112కు చేరుకుంది. అయితే, మేజిక్ ఫిగర్ 118కి మరో 6 సీట్ల దూరం ఉంది. ఈ 6 సీట్ల కోసం టీవీకే కమ్యూనిస్టు పార్టీలు (CPI, CPM), పీఎంకే వైపు చూస్తోంది. కానీ గవర్నర్ మాత్రం ‘ముందు 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖలు ఇవ్వండి, అప్పుడే పిలుస్తాను’ అని భీష్మించుకుని కూర్చున్నారు. గతంలో అనేక రాష్ట్రాల్లో అతిపెద్ద పార్టీని పిలిచి, ఆ తర్వాత సభలో మెజారిటీ నిరూపించుకోమని చెప్పే ఆనవాయితీ ఉంది. కానీ తమిళనాడులో మాత్రం గవర్నర్ భిన్నంగా వ్యవహరించడం వెనుక ‘కుట్ర’ కోణం ఉందనేది అభిమానుల వాదన.

మరోవైపు.. డీఎంకే తన పాత మిత్రపక్షమైన కాంగ్రెస్ టీవీకేకు మద్దతు ఇవ్వడాన్ని ‘వెన్నుపోటు’గా అభివర్ణిస్తోంది. అటు ఏఐఏడీఎంకే కూడా టీవీకేకు మద్దతు ఇచ్చే విషయంలో వెనకాడుతోంది. ఈ గందరగోళం మధ్య, ఒకవేళ విజయ్ మెజారిటీ నిరూపించుకోలేకపోతే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి.. తమిళనాడులో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అతిపెద్ద పార్టీని అధికారానికి దూరం చేయడానికి కేంద్రంలోని అధికార పార్టీ గవర్నర్ వ్యవస్థ ద్వారా చక్రం తిప్పుతోందనేది టీవీకే శ్రేణుల ప్రధాన అనుమానం.