Ban Hookah bars: హుక్కా బార్లను నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు తమిళనాడు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్ ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. తమిళనాడు రాజధాని చెన్నైలో హుక్కా బార్‌లు పెద్ద ఎత్తున పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయని, అనేక రెస్టారెంట్లు కూడా ఈ సర్వీసెస్‌ను అందుబాటులో ఉంచుతున్నాయని మంత్రి సుబ్రమణియన్ వెల్లడించారు. పొగాకు దుర్వినియోగాన్ని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా హుక్కా బార్‌ను నిషేధిస్తూ సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టానికి సవరణలు చేస్తూ తమిళనాడు అసెంబ్లీ బిల్లుకు ఆమోదం తెలిపింది.
PM Narendra Modi: ప్రధాని దీపావళి గిఫ్ట్.. 75 వేల మందికి ఉద్యోగాలు
స్మోకింగ్ జోన్స్, హుక్కా అనుమతి ప్రాంతాలను ఏర్పాటు చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయని మంత్రి సుబ్రమణియన్ పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో హుక్కా బార్లను నియంత్రించే చట్టం లేదు. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం, 2003 (కేంద్ర చట్టం 34, 2003)ని తమిళనాడు రాష్ట్రానికి తగిన విధంగా సవరిస్తూ మంత్రి ఎం సుబ్రమణియన్ బిల్లును ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం హుక్కా బార్లను నిషేధిస్తూ, ఏదైనా ఉల్లంఘనకు పాల్పడితే మూడేళ్ల వరకు జైలుశిక్ష, యాభై వేల రూపాయల వరకు జరిమానా విధించాలని నిర్ణయించింది. హుక్కా బార్ నుంచి మెటీరియల్స్‌ను స్వాధీనం చేసుకునేందుకు సబ్-ఇన్‌స్పెక్టర్, అంతకంటే పై పోలీసు అధికారికి అధికారం కల్పించే క్లాజును జోడించాలని కూడా బిల్లు కోరింది.
