మొత్తానికి సుప్రీంకోర్టు ఆదేశాలకు తమిళనాడు గవర్నర్ రవి తలొగ్గారు. గురువారం గవర్నర్ తీరును సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. డీఎంకే నేత పొన్ముడిని ప్రమాణస్వీకారానికి ఆహ్వానించకపోవడంపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 24 గంటల్లో ప్రమాణస్వీకారం చేయించకపోతే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించింది. ఎట్టకేలకు గవర్నర్ రవి.. పొన్ముడిని ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు. శుక్రవారం రాజ్‌భవన్‌లో పొన్ముడి చేత గవర్నర్ రవి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్టాలిన్, పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
ఇటీవల ఆస్తుల కేసులో పొన్ముడిని మద్రాస్ హైకోర్టు దోషిగా తేల్చింది. అయితే దీనిపై పొన్ముడి సుప్రీంకోర్టును ఆశ్రయించగా తీర్పుపై స్టే విధించింది. దీంతో పొన్ముడిని ముఖ్యమంత్రి స్టాలిన్ మంత్రివర్గంలోకి తీసుకునేందుకు గవర్నర్‌కు తెలియజేయగా.. అందుకు ఆయన నిరాకరించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై గురువారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. గవర్నర్ తీరుపై తీవ్రంగా మండిపడింది. 24 గంటల్లో పొన్ముడి చేత ప్రమాణం చేయించాలని ఆదేశించింది. లేదంటే తాము జోక్యం చేసుకోవాలని హెచ్చరించింది. అయినా ఎవరైనా సరే రాజ్యాంగాన్ని గౌరవించాలని సూచించింది. మొత్తానికి కోర్టు ఆదేశాలతో గవర్నర్ రవి.. పొన్ముడి చేత శుక్రవారం ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో కథ సుఖాంతం అయింది.
ఇది కూడా చదవండి: Harish Rao : బీజేపీకి బీ టీమ్ లీడర్‌గా రేవంత్ రెడ్డి తీరు