Vijay TVK Government: తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించారు విజయ్. దాదాపు ఆరు దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని శాసించిన ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి తెరదించుతూ, దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. 234 స్థానాలున్న అసెంబ్లీలో 108 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే.. అటు డీఎంకేను ఓడించి, ఇటు ఏఐఏడీఎంకేను మూడో స్థానానికి నెట్టేసి రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ (118)కు కేవలం పది సీట్ల దూరంలో విజయ్ పార్టీ నిలిచిపోవడంతో రాష్ట్రంలో సంకీర్ణ రాజకీయాలు ఊపందుకున్నాయి.
ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజా ఎన్నికల్లో ఐదు స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ, విజయ్ ప్రభుత్వానికి బేషరతుగా కాకుండా కొన్ని షరతులతో కూడిన మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైంది. దీనిపై నిర్వహించిన వర్చువల్ సమావేశంలో కాంగ్రెస్ ఓ తీర్మానాన్ని సైతం ఆమోదించింది. ఈ మద్దతుకు ప్రతిఫలంగా మంత్రివర్గంలో రెండు బెర్తులు, అలాగే కొన్ని ప్రభుత్వ బోర్డుల ఛైర్మన్ పదవులను కాంగ్రెస్ కోరుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక మద్దతు లేఖ బుధవారం విడుదల కానుంది. ఆ వెంటనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పనైయూర్‌లోని టీవీకే రాజకీయ కార్యాలయానికి వెళ్లి విజయ్‌తో భేటీ కానున్నారు.
మరోవైపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు విజయ్ ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారు. తన నివాసంలో నూతన ఎమ్మెల్యేలతో సమావేశమై మంత్రివర్గ కూర్పుపై సుదీర్ఘంగా చర్చించారు. అందుతున్న సమాచారం ప్రకారం.. మే 7వ తేదీన విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మరో తొమ్మిది మంది మంత్రులు సైతం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్‌తో పాటు వీసీకే, సీపీఐ(ఎం), సీపీఐ, ఐయూఎంఎల్ వంటి వామపక్ష, ప్రాంతీయ పార్టీలతోనూ టీవీకే చర్చలు జరుపుతోంది. ఈ పార్టీలన్నీ కలిస్తే విజయ్ నేతృత్వంలోని కూటమి బలం మెజారిటీ మార్కును సులువుగా దాటుతుంది.
అయితే, తమ మిత్రపక్షాలైన వామపక్షాలు, వీసీకేలు విజయ్ వైపు వెళ్లవని డీఎంకే ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, కాంగ్రెస్ నిర్ణయంపై మాత్రం ఆ పార్టీ పెదవి విప్పడం లేదు. ఇప్పటికే కాంగ్రెస్ తన మద్దతుపై టీవీకే నాయకత్వానికి స్పష్టమైన సంకేతాలు పంపిన నేపథ్యంలో తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. దశాబ్దాల ద్రవిడ కోటను బద్దలు కొట్టిన విజయ్, ఒక స్థిరమైన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తారనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.
