CM Vijay: పెరియార్ సామాజిక సూత్రాలు ఓకే.. కానీ నాస్తికత్వం మాకొద్దు.. సీఎం విజయ్ సంచలన ప్రకటన

Cmvijay

Cmvijay

CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన సీ జోసెఫ్ విజయ్ (నటుడు విజయ్).. అసెంబ్లీ వేదికగా తన రాజకీయ భావజాలాన్ని, భవిష్యత్తు కార్యాచరణను అత్యంత స్పష్టంగా ప్రకటించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం శాసనసభలో మాట్లాడిన ఆయన.. ద్రావిడ రాజకీయాల మూలపురుషుడు పెరియార్ ఈవీ రామసామి సిద్ధాంతాలపై తనకున్న స్పష్టమైన వ్యూహాన్ని వెల్లడించారు. పెరియార్ ప్రతిపాదించిన సామాజిక సమానత్వ సూత్రాలను తాము పూర్తిగా నమ్ముతామని, అయితే ఆయనకున్న నాస్తిక భావాలను, మత తిరస్కరణను మాత్రం తమ పార్టీ అంగీకరించబోదని విజయ్ తేల్చి చెప్పారు. తాము దైవవిశ్వాసులమని, సమాజంలో ఎవరి సిద్ధాంతాలకూ వ్యతిరేకం కాదని క్లారిటీ ఇచ్చారు. తమ ప్రభుత్వం కేవలం ఒకరి ఆలోచనలకే పరిమితం కాలేదని.. పెరియార్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మాజీ ముఖ్యమంత్రి కె. కామరాజ్ వంటి మహోన్నత నేతల ఆదర్శాల సమ్మేళనంతో ముందుకు సాగుతోందని ప్రకటించారు. అంబేద్కర్ అందించిన సమాన అవకాశాలు, సామాజిక న్యాయాన్ని పుణికిపుచ్చుకుంటూనే.. కామరాజ్ అందించిన అవినీతి రహిత, నిజాయితీతో కూడిన పరిపాలనా నమూనాను తమ ప్రభుత్వానికి మార్గదర్శకంగా తీసుకున్నట్లు విజయ్ వివరించారు.

సినిమా రంగం నుంచి వచ్చిన తమను కేవలం ఒక నటుడి పార్టీగా చూస్తూ విమర్శించిన వారికి విజయ్ అసెంబ్లీ సాక్షిగా గట్టి కౌంటర్ ఇచ్చారు. సాధారణంగా చాలామంది మొదట రాజకీయ పార్టీ పెట్టి ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్తారని, కానీ తాము మాత్రం ముందుగా ప్రజల్లోకి వెళ్లి, వారి నాడి తెలుసుకున్న తర్వాతే పార్టీని స్థాపించామని గుర్తుచేశారు. ఈ వ్యత్యాసాన్ని గ్రహించలేని వారే తమపై చులకనగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పొత్తులు లేకుండా 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగి.. ఏకంగా 35 శాతం ఓట్ల షేర్‌తో పాటు 1.72 కోట్ల (17.2 మిలియన్ల) ఓట్లను సాధించి, ఒక స్వతంత్ర రాజకీయ శక్తిగా అవతరించడం వల్లే తామిప్పుడు ప్రభుత్వంలో కూర్చున్నామని గర్వంగా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో కులమతాల అడ్డుగోడలను బద్దలు కొట్టి ప్రజలు తమను ఆదరించారని, అందుకే తమ పాలనను గతంలో అన్నాదురై, ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) అందించిన ‘సాధారణ, అత్యంత సాధారణ ప్రజల ప్రభుత్వాల’తో పోల్చారు. ఇప్పుడు విజయ్ నేతృత్వంలో నడుస్తున్నది ‘అట్టడుగు వర్గాల, అత్యంత సామాన్యుల ప్రభుత్వం’ అని సగర్వంగా ప్రకటించారు.

×
×
Ad

తమ ఎదుగుదలను తట్టుకోలేక కొందరు ప్రత్యర్థులు రాజకీయంగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, కరూరులో 41 మంది ప్రాణాలు కోల్పోతే దానికి కూడా తమపైనే నిందలు వేయడం ఏ రకమైన రాజకీయమని విజయ్ ప్రశ్నించారు. రాజకీయ ప్రత్యర్థులకు, సైద్ధాంతిక శత్రువులకు మధ్య ఉన్న తేడాను తమ పార్టీ స్పష్టంగా గుర్తిస్తుందని చెప్పారు. ఇదే సమయంలో గత డీఎంకే ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత పాలనలో “పార్టీ ఫండ్” పేరుతో భారీ ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని విజయ్ ఆరోపించడంతో అసెంబ్లీలో తీవ్ర దుమారం రేగింది. ఈ వ్యాఖ్యలకు నిరసనగా డీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అలాగే లెఫ్ట్ పార్టీల (వామపక్షాల) గురించిన ప్రస్తావనపై స్పందిస్తూ.. ఆ పార్టీలు తమ కూటమిలోకి ఎవరి దయాదాక్షిణ్యాల వల్లో లేదా బలవంతం వల్లో రాలేదని, స్వచ్ఛందంగానే చేరాయని స్పష్టం చేశారు. అయితే కొందరు లెఫ్ట్ నాయకులు మాట్లాడుతున్న కొన్ని మాటలు తనకు అర్థం కావడం లేదంటూ విజయ్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.