Site icon NTV Telugu

MK Stalin-Djokovic: ఆకాశంలో ఆశ్చర్యం.. టెన్నిస్‌ దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌ను కలిసిన త‌మిళ‌నాడు సీఎం!

Mk Stalin Djokovic

Mk Stalin Djokovic

Tamil Nadu CM MK Stalin Meets Novak Djokovic: టెన్నిస్‌ దిగ్గజం, సెర్బియా స్టార్ నొవాక్‌ జొకోవిచ్‌ను త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్‌ కలిశారు. స్పెయిన్‌కు వెళ్లే మార్గంలో విమానంలోనే జొకోవిచ్‌ను స్టాలిన్‌ కలుసుకున్నారు. కాసేపు టెన్నిస్‌ దిగ్గజంతో మాట్లాడిన సీఎం.. ఆపై ఫొటో దిగారు. ఈ పోటోలను స్వయంగా త‌మిళ‌నాడు సీఎం తన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. విమానంలో జొకోవిచ్‌ను చూసి ఒక్క‌సారిగా ఆశ్చ‌ర్య‌పోయానని, అతడిని కలిసినందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

‘ఆకాశంలో ఆశ్చర్యం. స్పెయిన్‌కు వెళ్లే మార్గంలో టెన్నిస్ దిగ్గజం నోవాక్ జొకోవిక్‌ను కలిశాను’ అని త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్‌ ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ పోస్టుకు జొకోవిచ్‌తో తాను దిగిన ఫొటోను జత చేశారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌ 2024లో ఓట‌మి అనంత‌రం జ‌కో తన స్వ‌దేశమైన సెర్బియాకు బ‌య‌లుదేరాడు. ఆ స‌మ‌యంలోనే సీఎం స్టాలిన్‌ అతడిని క‌లిసి ఉంటారు.

Also Read: IND vs ENG: మహమ్మద్ సిరాజ్‌ ఎందుకు.. రోహిత్ శర్మను ప్రశ్నించిన భారత మాజీ క్రికెటర్!

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ 2024 సెమీస్‌ నుంచే నోవాక్ జకోవిచ్‌ నిష్క్రమించిన విషయం తెలిసిందే. మెల్‌బోర్న్ పార్క్‌లో శుక్రవారం జరిగిన సెమీస్‌లో జకోను 6-1, 6-2, 6-7 (6/8), 6-3తో ఇటాలియన్ స్టార్ జనిక్‌ సినర్‌ ఓడించాడు. 22 ఏళ్ల యువ ప్లేయర్ సినర్‌ ఆట ముందు.. జకో ఏ మాత్రం నిలవలేకపోయాడు. ప‌దిసార్లు చాంపియ‌న్ అయిన జకోవిచ్‌ సెమీస్‌లోనే వైదొల‌గ‌డం ఇదే మొద‌టిసారి. ప్ర‌పంచ టెన్నిస్‌లో 24 గ్రాండ్‌స్లామ్స్‌తో జకోవిచ్‌ చరిత్ర సృష్టించాడు.

Exit mobile version