Taliban Rejects US Proposal: ప్రపంచానికి తనకు తాను పెద్దన్న అని చెప్పుకుంటున్న దేశానికి ఇది నిజంగా అవమానమే.. ఇంతకీ ఏం జరిగిందని ఆలోచిస్తున్నారా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆఫ్ఘనిస్థాన్‌లోని బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ట్రంప్ తాలిబన్ ప్రభుత్వం ముందు ఒక ప్రతిపాదనను ఉంచారు. తాజాగా శుక్రవారం తాలిబన్లు ట్రంప్ ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. ఒక రకంగా చెప్పాలంటే అమెరికాను ఛీ కొట్టారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది నిజంగానే అగ్రరాజ్యానికి అవమానం అంటున్నారు. 20 ఏళ్ల యుద్ధం తర్వాత తాలిబన్లు 2021లో కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో వారు అమెరికా దళాలను వారి దేశం నుంచి తరిమికొట్టారు. ఇంతకీ ఈ బాగ్రామ్ వైమానిక స్థావరం ఎందుకు అంత స్పెషల్ అనేది ఈ స్టోరీలో చూద్దాం..
READ ALSO: H-1B visa: ట్రంప్ H-1B వీసా చర్యతో ఎయిర్‌పోర్టుల్లో గందరగోళం..పెరిగిన అమెరికా విమాన ఛార్జీలు..
ట్రంప్‌కు ఎదురుదెబ్బ.. అమెరికా ప్రతిపాదనను తిరస్కరించిన తాలిబన్లు..
తాలిబన్లు కాబుల్‌కు రావడంతోనే అమెరికా సేవలను ఆఫ్ఘనిస్థాన్ భూభాగం నుంచి తరిమికొట్టారు. కానీ ఇప్పుడు ట్రంప్ మరోసారి మరోసారి ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా దళాలను మోహరించాలని పావులు కదుపుతున్నారు. ఇటీవల ట్రంప్.. చైనా, తాలిబన్ ప్రభుత్వానికి ఆఫ్ఘనిస్థాన్‌లోని బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని అమెరికాకు అప్పగించాలని ప్రతిపాదించారు. ట్రంప్ ప్రతిపాదనను తాలిబన్లు తిరస్కరించారు. అలాగే చైనా కూడా దీనిని తీవ్రంగా ఖండించింది. బాగ్రామ్ వైమానిక స్థావరం అనేది ఆఫ్ఘనిస్థాన్‌లోని పర్వాన్ ప్రావిన్స్‌లో, కాబూల్‌కు ఉత్తరాన దాదాపు 40–60 కి.మీ దూరంలో ఉన్న ఒక ప్రధాన వైమానిక స్థావరం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత వ్యూహాత్మకంగా ముఖ్యమైన వైమానిక స్థావరాలలో ఒకటిగా రికార్డ్‌ను సొంతం చేసుకుంది.
ఈ ఎయిర్‌బేస్ ఎందుకు స్పెషల్..
1950లలో సోవియట్ యూనియన్ బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని నిర్మించింది. 1980లలో జరిగిన సోవియట్-ఆఫ్ఘన్ యుద్ధం సమయంలో ఇది సోవియట్ దళాలకు ప్రధాన స్థావరంగా పనిచేసింది. 2001లో జరిగిన 9/11 దాడుల తరువాత అమెరికా దళాలు ఆఫ్ఘనిస్థాన్‌ను ఆక్రమించి, ఆ స్థావరాన్ని వారి ఆధీనంలోకి తీసుకున్నాయి. ఆఫ్ఘనిస్థాన్ 20 ఏళ్ల యుద్ధంలో ఈ వైమానిక స్థావరం అమెరికా దళాలకు కేంద్రంగా పనిచేసింది. 30 వేల కంటే ఎక్కువ మంది అమెరికన్ సైనికులు అక్కడ మోహరించడంతో పాటు, ఇది నాటో దళాలకు ప్రధాన కార్యాలయంగా ఉండేది. బాగ్రామ్ ఎయిర్ బేస్‌లో C-5 గెలాక్సీ, B-52 బాంబర్‌ల వంటి పెద్ద కార్గో విమానాలకు అనువైన 11 వేల అడుగుల కాంక్రీట్ రన్‌వేలు ఉన్నాయి. ఇక్కడ 110 కి పైగా విమాన షెల్టర్లు, ఇంధన డిపోలు, ఆసుపత్రులు, జైళ్లు, నిఘా కేంద్రాలు ఉన్నాయి.
ఈ ఎయిర్‌బేస్ దక్షిణాసియా, మధ్య ఆసియా, పశ్చిమాసియా కూడలిలో, ఇరాన్, పాకిస్థాన్, చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్, రష్యా సరిహద్దులో ఉంది. చైనా అణ్వాయుధ ఉత్పత్తి కేంద్రాలు జిన్జియాంగ్‌లో ఉన్నాయి. జిన్జియాంగ్ ఈ ఎయిర్‌బేస్ నుంచి కేవలం ఒక గంట డ్రైవ్ దూరంలో (సుమారు 500 మైళ్లు) ఉంది. చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడంలో ఈ స్థావరం అమెరికాకు కీలకంగా మారవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇది చైనా – ఇరాన్ రెండింటిపై ఏకకాలంలో నిఘా ఉంచగలదు. ఉగ్రవాద నిరోధక, డ్రోన్ కార్యకలాపాలు, వైమానిక దాడులు, నిఘా కోసం అమెరికా ఈ స్థావరాన్ని ఉపయోగించవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. మధ్య ఆసియాలో అమెరికా ప్రభావాన్ని కొనసాగించడానికి ఇది ఒక ద్వారంగా పనిచేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. 2021లో అమెరికా దళాలు ఇక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత, ఇది తాలిబన్ల నియంత్రణలోకి వచ్చింది.
READ ALSO: Russia Airspace Violation: రష్యా బరితెగింపు.. దీటుగా స్పందించిన నాటో కూటమి..
