Afghanistan : ఆఫ్గానిస్థాన్లో ప్రజా ప్రభుత్వం పోయి తాలిబన్లు రాజ్యమేలుతున్నారు. ఈ క్రమంలో వారు మహిళలపై కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. పురుషులు వెంట లేకుండా మహిళలు ఇండ్ల నుంచి బయటకు రావడానికి వీల్లేదని, బాలికల సెకండరీ స్కూళ్లు మూసివేయాలని, మహిళలు ఉద్యోగాలు చేయకూడదంటూ మరో వివాదాస్పద ఆదేశాలు జారీ చేశారు. నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు అమలులో ఉంటుందని తెలిపింది. గత ఏడాది ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ అధికారం చేపట్టిన తర్వాత, తరగతి గదుల్లో మగ, ఆడ విద్యార్థులు కలిసి చదువుకోవడంపై నిషేధం విధించారు. మహిళలకు విద్యాబోధనను వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీలకు ఉన్నత విద్యాశాఖ మంత్రి నేదా మహమ్మద్ నదీమ్ లేఖ రాశారు.
Read Also: Mega Family: మెగాస్టార్ ఇంట క్రిస్మస్ సెలబ్రేషన్స్.. ఫ్యామిలీ అంతా ఒకే ఫ్రేమ్ లో
అయితే తాలిబన్ల నిర్ణయంపై అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. మహిళలకు యూనివర్సిటీ విద్యపై నిషేధం విధించడం, బాలికల సెకండరీ స్కూల్ మూసివేయడం, మహిళలు, బాలికలపై ఆంక్షలు విధించడం వంటివి వారి హక్కులు, స్వేచ్ఛను హరించడమేనని అమెరికా హోం శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళల హక్కులను ఇది కాలరాయడమేనని ఐక్యరాజ్య సమితిలో బ్రిటన్ రాయబారి బార్బరా వుడ్ వార్డ్ అన్నారు. మహిళలకు యూనివర్సిటీ విద్యను దూరంచేస్తూ తాలిబన్లు తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. పాశ్చాత్య దేశాలు ఇప్పటికీ తాలిబాన్‌ను ఆఫ్ఘనిస్తాన్ అధికారిక ప్రభుత్వంగా గుర్తించలేదు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించాలంటే తాలిబాన్లు దేశంలో బాలికలకు విద్యను బలోపేతం చేయాలని పాశ్చాత్య దేశాలు చెబుతున్నాయి. తాలిబాన్ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు తీవ్ర విచారకరమని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.
