Site icon NTV Telugu

T20 World Cup: కూన జట్టు నెదర్లాండ్స్‌తో భారత్ పోరు నేడే..

T20 World Cup

T20 World Cup

T20 World Cup: టీ20 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్థితో మ్యాచ్‌లో విజయం ఉత్సాహాన్నిస్తుంటే.. రెట్టించిన ఉత్సాహంతో మరో మ్యాచ్‌కు సిద్ధమైంది టీమిండియా. కూన జట్టు నెదర్లాండ్స్‌తో నేడు భారత్‌ తలపడనుంది. భీకర ఫామ్‌లో ఉన్న పాకిస్తాన్‌ను ఓడించిన భారత్ రెండో పోరులో ఒక అసోసియేట్ జట్టును ఎదుర్కోబోతోంది. అయినా ప్రత్యర్థి జట్టు ఎంత కూనే అయినా అప్రమత్తత చాలా అవసరం. ఇంగ్లాండ్‌పై ఐర్లాండ్‌ ప్రదర్శన చూసిన అనంతరం ఎవరిని తక్కువగా అంచనా వేయొద్దని తెలుస్తోంది. గెలుపు నల్లేరు మీద నడకే అయినా జాగ్రత్తగా ఉండాలని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాకిస్తాన్‌పై నిరాశపరిచిన టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ ఫామ్‌ను అందుకోవడానికి దీనిని అవకాశంగా మలుచుకోవాలి. బలమైన భారత్‌ జట్టును తట్టుకోవడం డచ్‌ జట్టుకు కష్టమే.

ఇప్పటివరకు అంతర్జాతీయ టీ-20ల్లో తలపడని భారత్, నెదర్లాండ్‌ జట్లు.. ప్రపంచ కప్ వేదికగా మొదటిసారి తలపడబోతున్నాయి. టీమిండియా తన రెండో సూపర్‌-12 మ్యాచ్‌లో గురువారం నెదర్లాండ్స్‌ను ఢీకొంటోంది. పసికూనపై భారత్‌ తమ సత్తా చాటుతుందని భావిస్తున్నా.. డచ్‌ జట్టు కూడా ఏ మాత్రం తీసిపోకుండా సంచలనం కోసం ప్రయత్నిస్తోంది. శ్రీలంక చేతిలో ఓడిన నెదర్లాండ్స్‌ తమ ప్రదర్శనను మెరుగుపర్చుకోవాలని పట్టుదలగా ఉంది. బలాబలాలు చూస్తే మాత్రం రోహిత్‌సేన హాట్ ఫేవరెటే. మ్యాక్స్‌ ఒ డౌడ్, విక్రమ్‌జిత్‌ సింగ్, అకర్‌మన్, టామ్‌ కూపర్‌ నెదర్లాండ్స్‌ జట్టులో కీలక ఆటగాళ్లు. కెప్టెన్‌ స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ ముందుండి స్ఫూర్తిదాయకంగా జట్టును నడిపిస్తున్నాడు. ప్రధాన బౌలర్‌ మీర్‌కెరెన్‌ ఫామ్‌లో ఉన్నాడు.

Covid Vaccine: నోటి ద్వారా కరోనా టీకా.. చైనాలో పంపిణీ షురూ

ఈ మ్యాచ్‌ అనంతరం భారత్‌ సఫారీలతో ఆడనుంది. దక్షిణాఫ్రికాతో పెద్ద మ్యాచ్‌కు ముందు లోపాలను సరిదిద్దుకునేందుకు భారత్‌కు ఈ మ్యాచ్‌ ఉపయోగపడనుంది. టాప్‌-4లో బ్యాట్స్‌మెన్‌ తమ బ్యాటింగ్‌ ఫామ్‌ను అందుకోవడానికి ఈ మ్యాచ్‌ మంచి అకాశం. టాస్‌ గెలిస్తే భారత్ బ్యాటింగ్ ఎంచుకుని భారీ స్కోరు చేయడం మొగ్గు చూపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. టీమిండియా లాంటి బలమైన జట్టును ఢీకొట్టడం కష్టమైన పనే అయినా.. నెదర్లాండ్స్‌ సత్తా చాటుకోవడానికి ప్రయత్నిస్తుందనడంలో కూడా సందేహం లేదు.

Exit mobile version