T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026 రసవత్తరంగా సాగుతోంది. 20 జట్లతో మొదలైన ఈ మెగా టోర్నీలో ఇప్పటికే 12 జట్లు ఇంటిబాట పట్టాయి. అయితే, ఈ టోర్నీలో కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా విజయం సాధించలేకపోయిన జట్లపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఒక్క మ్యాచ్ గెలవకపోయినా ఆ జట్లు ఖాళీ చేతులతో కాకుండా, కోట్ల రూపాయల ప్రైజ్ మనీతో తిరిగి వెళ్తున్నాయి. అది ఎలాగో చదివేయండి..
READ ALSO: Ajit Pawar Plane Crash: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడిపై రోహిత్ పవార్ సంచలన ఆరోపణలు..
ఖాతా తెరవని ఆ మూడు జట్లు ఇవే..
ఈ ప్రపంచకప్‌లో మొత్తం మూడు జట్లు, ఆడిన నాలుగు లీగ్ మ్యాచ్‌ల్లోనూ ఓటమి మూటగట్టుకున్నాయి. ఆ జట్లు ఏవంటే నమీబియా.. గ్రూప్-ఎలో ఉన్న నమీబియా.. భారత్, పాకిస్థాన్, నెదర్లాండ్స్, అమెరికా చేతిలో పరాజయం పాలైంది. నెక్ట్స్ కెనడా.. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్, యూఏఈ జట్లతో జరిగిన పోరులో కెనడా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. తర్వాత ఒమన్. ఈ జట్టు జింబాబ్వే, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఐర్లాండ్ జట్ల చేతిలో ఓడిపోయి గ్రూప్ దశలోనే వెనుదిరిగింది. మిగిలిన 17 జట్లు టోర్నీలో కనీసం ఒక్క విజయాన్నైనా నమోదు చేయడం విశేషం.
ఒక్కో జట్టుకు రూ.2 కోట్ల ప్రైజ్ మనీ..
ఐసీసీ (ICC) నిబంధనల ప్రకారం.. ఈ మెగా టోర్నీలో పాల్గొన్న ప్రతి జట్టుకు వారి ర్యాంకింగ్ ఆధారంగా ఫ్రైజ్ మనీ లభిస్తుంది. గత గణాంకాల ప్రకారం, ఈ టోర్నీలో 13 నుంచి 20వ స్థానాల మధ్య నిలిచిన జట్లకు సుమారు US$225,000 అందజేస్తారు. అంటే భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.2 కోట్లతో సమానం. 9 నుంచి 12వ స్థానాల్లో నిలిచిన జట్లకు సుమారు రూ.2.25 కోట్లు (US$247,500) లభిస్తాయి. దీని ప్రకారం, ఒక్క విజయం కూడా సాధించని ఒమన్, నమీబియా, కెనడా జట్లకు ఒక్కొక్కరికి కనీసం రూ.2 కోట్ల రూపాయల చొప్పున ఐసీసీ నుంచి అందనున్నాయి.
ఈ నిధులు దేనికి ఉపయోగపడతాయంటే..
అసోసియేట్ దేశాలైన ఈ జట్లకు అందించే ప్రైజ్ మనీ ఒక వరమనే చెప్పాలి. ఐసీసీ అందించే ఈ నిధులను ఆయా దేశాల్లో క్రికెట్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి, యువ ఆటగాళ్లను ప్రోత్సహించడానికి, తదుపరి అంతర్జాతీయ టోర్నీల సన్నాహాల కోసం ఖర్చు ఉపయోగిస్తారు.
