Site icon NTV Telugu

T20 World Cup 2026: “ఇదంతా నీ వల్లే జరిగింది”.. హార్దిక్ పాండ్యాపై అలిగిన ఇషాన్ కిషన్..

Ishan Kishan Hardik Pandya

Ishan Kishan Hardik Pandya

T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్–పాకిస్థాన్ మ్యాచ్ హీట్ పుట్టించనుంది. రేపు శ్రీలంకలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. నిన్న నమీబియాతో భారత్ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. నమీబియాను 93 పరుగుల తేడాతో ఓడించింది. ఈ విజయంలో హార్దిక్ పాండ్యా ప్రధాన పాత్ర పోషించినవాడు. అటు బ్యాటింగ్‌లో ఇటు బౌలింగ్‌లో రెండింటి లోనూ మెరిశాడు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా అద్భుత ఆరంభం ఇచ్చారు. ఎడమచేతి బ్యాటర్ అయిన ఇషాన్ కిషన్ కేవలం 24 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 250కిపైగా ఉంది. ఆ ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లు బాదాడు. మొదటి భాగం ముగిసే సరికి మ్యాచ్ మొత్తం కిషన్ చుట్టూనే తిరుగుతున్నట్టే అనిపించింది. కానీ హార్దిక్ పాండ్యా ఒక్కసారిగా చెలరేగాడు. కేవలం 28 బంతుల్లో 52 పరుగులు చేశాడు. నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదాడు. అతని దూకుడు ఆటతో భారత్ స్కోరు వేగంగా పెరిగింది. ఇద్దరి అర్ధశతకాలతో భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసింది.

READ MORE: MS Dhoni: పాక్ మిస్టరీ స్పిన్నర్ తారిక్ ఎదుగుదలలో ఎంఎస్ ధోని కీలక పాత్ర..

అయితే అసలు మలుపు బౌలింగ్‌లో వచ్చింది. హార్దిక్ తన నాలుగు ఓవర్లలో 21 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. అతని బౌలింగ్‌తో నమీబియా జట్టు ఒత్తిడిలో పడింది. మొదట్లో వారు బాగా ఆడుతున్నట్టే కనిపించారు. కానీ మధ్యలో వికెట్లు వరుసగా పడిపోవడంతో మ్యాచ్ చేతుల నుంచి జారిపోయింది. చివరకు నమీబియా 18.2 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌట్ అయింది. బ్యాటింగ్‌లో కిషన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడినా, బౌలింగ్‌లోనూ ప్రభావం చూపిన హార్దిక్ మ్యాచ్‌ను పూర్తిగా తనవైపు తిప్పుకున్నాడు. అందుకే అతనికి “ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు దక్కింది. ఈ అవార్డు విషయంలో ఇషాన్ కిషన్, హార్దిక్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో ఇషాన్ కిషన్, హార్దిక్ ఇద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు. “నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నువ్వు నా మాన్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకెళ్లావ్” అంటూ కిషన్ సరదాగా అన్నాడు. ఇద్దరూ నవ్వుల్లో మునిగిపోయారు. హార్దిక్ అంతర్జాతీయ క్రికెట్‌లో తిరిగి బలంగా నిలబడటానికి ఎంత కష్టపడ్డాడో తనకు తెలుసని కిషన్ చెప్పాడు. “ఎవరైనా గురించి నెగటివ్‌గా మాట్లాడటం మన పని కాదు. మన చేతిలో ఉన్నదే చేయాలి. అది మంచి ఆట ఆడటం” అని హార్దిక్ తనకు చెప్పేవాడని కిషన్ వెల్లడించాడు. తాను కూడా అదే మార్గంలో నడిచానని, ఆ కృషికి హార్దిక్‌కి సైతం క్రెడిట్ ఇవ్వాలని అన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “ఇదంతా హార్దిక్ వల్లే జరిగింది” అంటూ నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.

READ MORE: Bangladesh Elections 2026: బంగ్లాదేశ్ ఎన్నికల్లో సంచలనం.. నాలుగురు హిందూ అభ్యర్థులు ఘన విజయం..

Exit mobile version