2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ ఫిబ్రవరి-మార్చిలో భారత్, శ్రీలంక వేదికల్లో సంయుక్తంగా జరగనుంది. ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభం కావడానికి ఎక్కువ సమయం లేదు. అయినా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇంకా షెడ్యూల్ ప్రకటించలేదు. మెగా టోర్నీ పూర్తి షెడ్యూల్ ఈ వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. ప్రపంచకప్ మ్యాచ్‌లు ఎనిమిది వేదికల్లో జరుగనున్నాయి.
భారతదేశంలోని అహ్మదాబాద్ (నరేంద్ర మోడీ స్టేడియం), కోల్‌కతా (ఈడెన్ గార్డెన్స్), ముంబై (వాంఖడే స్టేడియం), ఢిల్లీ (అరుణ్ జైట్లీ స్టేడియం), చెన్నై (ఎంఏ చిదంబరం స్టేడియం)లు 2026 టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ల కోసం షార్ట్‌లిస్ట్ చేయబడ్డాయి. శ్రీలంకలో మూడు వేదికలలో మ్యాచ్‌లు జరుగుతాయి: కొలంబో (ఆర్ ప్రేమదాస స్టేడియం అండ్ సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్), కాండీ (పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం) వేదికలను ఐసీసీ షార్ట్‌లిస్ట్ చేసిందని తెలుస్తోంది. ఒకవేళ శ్రీలంక, పాకిస్తాన్ సెమీఫైనల్‌కు చేరుకుంటే.. మ్యాచ్‌లు కొలంబోలో జరుగుతాయి. పాకిస్తాన్, శ్రీలంక సెమీఫైనల్‌కు చేరకపోతే.. మ్యాచ్‌లు భారతదేశంలో జరుగుతాయి. భారతదేశంలో రెండు సెమీఫైనల్‌లు జరిగితే.. ఒకటి అహ్మదాబాద్, మరొకటి కోల్‌కతాలో జరగనున్నాయి.
Also Read: Gold Rate Today: కొనుగోలుదారులకు బిగ్ అలర్ట్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు!
2026 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ఫైనల్‌కు చేరుకుంటే.. టైటిల్ మ్యాచ్ కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరగనుంది. పాకిస్తాన్ ఫైనల్‌కు చేరుకోకపోతే.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రపంచకప్‌లో మొత్తం 20 జట్లు పాల్గొంటాయి. ఈ 20 జట్లను 4 గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్ నుంచి అగ్రస్థానంలోని రెండు జట్లు సూపర్ 8కి చేరుకుంటాయి. సూపర్ 8 తర్వాత సెమీ-ఫైనల్స్, ఫైనల్ ఉంటుంది. టెస్ట్ ఆడే 13 టీమ్స్ ప్రపంచకప్‌లో పాల్గొంటాయి. అదనంగా కెనడా, నెదర్లాండ్స్, యూఏఈ, నేపాల్, ఒమన్, నమీబియా, ఇటలీలు మెగా టోర్నమెంట్‌కు అర్హత సాధించాయి. ఇటలీ తొలిసారి ప్రపంచకప్‌లో ఆడనుంది.
