NTV Telugu Site icon

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌ ఆరంభం.. కెనడాతో అమెరికా ఢీ!

Canada Match

Canada Match

United States vs Canada Match Starts: అభిమానులు ఎంతగానో ఎదురుచుస్తున్న టీ20 ప్రపంచకప్‌ 2024 ఆరంభం అయింది. మెగా టోర్నీ తొలి మ్యాచ్‌లో కెనడాతో అమెరికా ఢీ కొడుతోంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం.. ఆదివారం (జూన్ 2) ఉదయం 6 గంటలకు ఆరంభం అయింది. టాస్ గెలిచిన అమెరికా బౌలింగ్ ఎంచుకుంది. కెనడా 15 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 137 రన్స్ చేసింది. టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లు స్టార్‌ స్పోర్ట్స్, హాట్‌ స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి.

క్రికెట్‌కు అంతగా ప్రాధాన్యం లేని అమెరికా.. వెస్టిండీస్‌తో కలిసి టీ20 ప్రపంచకప్‌కి ఆతిథ్యమివ్వబోతుండడం విశేషం. వెస్టిండీస్‌లో 2010లో మెగా పోరు జరిగింది. క్రికెట్‌ను మరిన్ని దేశాలకు విస్తరింపజేయడంలో భాగంగా ఐసీసీ తొలిసారి 20 జట్లతో ప్రపంచకప్‌ నిర్వహిస్తోంది. ర్యాంకింగ్, ఆతిథ్య జట్టు హోదాలో టీమ్‌లు ముందుగా అర్హత సాధించగా.. క్వాలిఫయింగ్‌ టోర్నీల ద్వారా మరిన్ని జట్లు బరిలో నిలిచాయి. 2028 లాస్‌ ఏంజెల్స్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ భాగంగా ఉండటంతో.. ఈ ప్రపంచకప్‌ ద్వారా అక్కడి అభిమానులను ఆకర్షించేందుకు ఐసీసీ ప్రయత్నిస్తోంది.

Also Read: T20 World Cup 2024: రిషబ్ పంత్ ఫిఫ్టీ.. బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం!

20 జట్లను 5 టీమ్స్ చొప్పున 4 గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో జట్టు తమ గ్రూప్‌లోని ఇతర నాలుగు జట్లతో తలపడుతుంది. టాప్‌-2లో నిలిచిన రెండు టీమ్‌లు సూపర్‌ ఎయిట్‌కు చేరుకుంటాయి. సూపర్‌ ఎయిట్‌లో ఎనిమిది టీమ్‌లను రెండు గ్రూప్‌లుగా విడదీస్తారు. ఒక్కో టీమ్‌ మిగిలిన మూడు జట్లతో మ్యాచ్‌లు ఆడుతుంది. ఒక్కో గ్రూప్ నుంచి టాప్‌-2లో నిలిచిన రెండు టీమ్‌లు సెమీస్ ఆడుతాయి. చివరగా ఫైనల్‌ మ్యాచ్ జరుగుతుంది. వెస్టిండీస్‌లో ఆరు, అమెరికాలలో మూడు వేదికలలో మ్యాచ్‌లు జరగనున్నాయి.

 

Show comments