Netherlands beat Nepal in T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో నెదర్లాండ్స్ బోణీ కొట్టింది. గ్రూప్-డిలో భాగంగా మంగళవారం డల్లాస్ వేదికగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో డచ్ టీమ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన నేపాల్ 19.2 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ రోహిత్ పౌడెల్ (35; 37 బంతుల్లో 5×4) టాప్ స్కోరర్. నెదర్లాండ్స్ బౌలర్లు టిమ్ ప్రింగిల్ (3/20), వాన్‌బీక్ (3/18), మేకరన్ (2/19), డిలీడ్ (2/22) ఆకట్టుకున్నారు. స్వల్ప లక్ష్యాన్ని నెదర్లాండ్స్ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఒడౌడ్ (54 నాటౌట్; 48 బంతుల్లో 4×4, 1×6) హాఫ్ సెంచరీ చేయగా.. విక్రమ్‌జీత్ సింగ్ (22; 28 బంతుల్లో 4×4) రాణించాడు.
టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-బిలో భాగంగా స్కాట్లాండ్, ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న స్కాట్లాండ్ నిర్ణీత 10 ఓవర్లలో ఒక వికెట్ కూడా కోల్పోకుండా 90 పరుగులు చేసింది. ఓపెనర్లు జార్జ్ మున్సీ (41 నాటౌట్; 31 బంతుల్లో 4×4, 2×6), మైకెల్ జోన్స్ (45 నాటౌట్; 30 బంతుల్లో 4×4, 2×6) చెలరేగారు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం వర్షం రావడంతో మ్యాచ్ రద్దయింది.
Also Read: India Alliance Meeting: నేడు ఇండియా కూటమి సమావేశం.. ఎన్టీయే మిత్రపక్షాలకు గాలం!
స్కాట్లాండ్ జట్టు 6.2 ఓవర్లలో 51/0తో ఉన్నప్పుడు తొలిసారి వర్షం పడింది. చాలా సమయం వృథా కావడంతో.. ఇన్నింగ్స్‌ను పది ఓవర్లకు కుదించారు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్ పూర్తికాగానే మరోసారి వర్షం పడింది. భారీ వర్షం కారణంగా తిరిగి ఆట సాధ్యం కాలేదు. దాంతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. ఒకవేళ ఆట ప్రారంభమై ఉంటే డక్‌వర్త్ లూయిస్ విధానంలో ఇంగ్లండ్ 109 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చేది. పసికూనపై విజయం సాధించాలని బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు నిరాశే ఎదురైంది.