ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు

Telangana Fiber

Telangana Fiber

తెలంగాణ సచివాలయంలో సమాచార సాంకేతిక, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు టీ-ఫైబర్ ప్రాజెక్టు పురోగతిపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి, టీ-ఫైబర్ మేనేజింగ్ డైరెక్టర్ వేణు ప్రసాద్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కేవలం టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నిర్దేశిత వ్యవధిలోగా అవసరమైన మౌలిక సదుపాయాలు, నెట్‌వర్క్ కనెక్టివిటీ పనులను పూర్తి చేసి ప్రతి ప్రభుత్వ కార్యాలయాన్ని టీ-ఫైబర్ పరిధిలోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 1 తర్వాత ప్రైవేట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఎటువంటి బిల్లులు ప్రాసెస్ చేయవద్దని, చెల్లింపులు జరపవద్దని అధికారులకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు.

ప్రభుత్వ శాఖలకు అంతరాయం లేని కనెక్టివిటీని అందించేందుకు టి-స్వాన్ (T-SWAN)ను ఒక నెల రోజుల్లోగా టీ-ఫైబర్ నెట్‌వర్క్‌లోకి పూర్తిగా బదిలీ చేయాలని సూచించారు. అలాగే.. ప్రతిష్టాత్మకమైన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుకు ప్రారంభం నుంచే ప్రపంచ స్థాయి డిజిటల్ మౌలిక సదుపాయాలు కల్పించేలా వేగవంతమైన టీ-ఫైబర్ ఇంటర్నెట్ సేవలకు సమగ్ర ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

రాష్ట్ర పౌరులందరికీ డిజిటల్ కనెక్టివిటీ అందించాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ‘ఇంటింటికీ ఇంటర్నెట్’ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నివాస గృహాలకు బ్రాడ్‌బ్యాండ్ విస్తరణను వేగవంతం చేయడం ద్వారా ప్రభుత్వ సంస్థలతో పాటు పౌరులందరికీ విశ్వసనీయమైన, సురక్షితమైన, సరసమైన ధరలో హై-స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు.