పండుగలు లేదా ప్రత్యేక సందర్భాల్లో ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా త్వరగా, ఎంతో రుచికరంగా చేసుకునే స్వీట్లలో ‘స్వీట్ వర్కీ పూరి’ ఒకటి. ఇది పైన కరకరలాడుతూ, లోపల జ్యూసీగా ఉండి పిల్లల నుంచి పెద్దల వరకు అందరికి నచ్చుతుంది. ఈ స్వీట్ తయారీ కోసం ముందుగా రెండు కప్పుల మైదా పిండిని తీసుకుని, అందులో చిటికెడు ఉప్పు, కొంచెం నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని మరీ మెత్తగా కాకుండా, సెమీ సాఫ్ట్‌గా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి .
Also Read : Sankranti Recipes : నోట్లో వేస్తే కరిగిపోయే ‘వెన్న ఉండలు’.. ఇలా చేస్తే అద్భుతంగా వస్తాయి!
మరోవైపు చక్కెర పాకం కోసం ఒక కప్పు చక్కెర, అర కప్పు నీళ్లు పోసి ఉంటే కుంకుమ పువ్వు కూడా అడ్ చేసి.. తీగ పాకం (గులాబ్ జామున్ పాకంలా) వచ్చే వరకు మరిగించాలి. చివరగా మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి కలిపి పక్కన ఉంచుకోవాలి . ఇక పూరీల తయారీ కోసం పిండిని చిన్న ఉండలుగా చేసుకుని, చపాతీల్లా పల్చగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న మూడు నాలుగు లేయర్ల మీద నెయ్యి, పొడి పిండి చల్లుతూ ఒకదానిపై ఒకటి చపాతి అమర్చి, రోల్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఆ ముక్కలను మళ్లీ పూరీల్లా చిన్నగా ఒత్తి, కాగుతున్న నూనెలో మీడియం ఫ్లేమ్‌పై గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించిన పూరీలను వెంటనే చక్కెర పాకంలో వేసి నిమిషం పాటు ఉంచి తీస్తే, నోట్లో వేస్తే కరిగిపోయే స్వీట్ వర్కీ పూరీలు సిద్ధం.
