Sweeper Gets Notice Of 16 Crore : సాధారణ జీవనం గడిపే స్వీపర్ 16 కోట్ల రూపాయలను రుణంగా తీసుకోవచ్చా.. ఇది వినడానికి తమాషాగా ఉన్నా.. వడోదర మున్సిపల్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న ఓ స్వీపర్‌కు రూ. 16కోట్ల రుణం చెల్లించాలంటూ ఓ బ్యాంకు నోటీసులు పంపించింది. ఈ నోటీసు స్వీపర్ కుటుంబానికి కంటి మీద కునుకు లేకుండా చేసింది. వడోదర మెట్రోపాలిటన్ మునిసిపాలిటీలో స్వీపర్‌గా పనిచేస్తున్న శాంతిలాల్ సోలంకి ఇంటిని సీజ్ చేయాలంటూ బ్యాంకు నుంచి నోటీసు వచ్చింది. 16 కోట్ల 50 వేల 300 రూపాయల రుణం రికవరీ బాకీ ఉండడమే ఈ నోటీసుకు కారణం. ఇదిలా ఉండగా.. నోటీసులు ఇచ్చిన బ్యాంక్‌లో తనకు ఖాతానే లేదని ఆ స్వీపర్ చెబుతున్నాడు. అతని భార్య భయంతో అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చేరింది.
గుజరాత్‌లోని వడోదర నగరానికి చెందిన శాంతిలాల్ సోలంకి అనే వ్యక్తి తన భార్య జాషి బెన్‌తో రాజ్యలక్ష్మి సొసైటీలో నివాసం ఉంటున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు మీరు అప్పు ఉన్నారని, మార్చి 4వ తేదీ లోపు వాటిని చెల్లించాలని బ్యాంకు అధికారులు నోటీసులు పంపించారు. రుణం చెల్లింకపోతే ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిక కూడా చేశారు. దీంతో శాంతిలాల్ కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది. అతని భార్య సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో చికిత్స కోసం ఆమెను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు.
Read Also: Wrestlers Protest: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులు.. జంతర్‌మంతర్ వద్ద మరోసారి ఆందోళన
శాంతిలాల్ కుటుంబం ఈ నోటీసుల గురించి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేసింది. కానీ ఎటువంటి లాభం లేకపోయింది. అనంతరం శాంతిలాల్.. స్థానిక ఎమ్మెల్యే నీరజ్ చోప్రాను ఆశ్రయించారు. ఎమ్మెల్యే చోప్రా బాధితుల తరఫున జిల్లా అధికారులకు వినతి పత్రాన్ని అందించారు. వారికి న్యాయం చేయాలని అధికారులను కోరారు. శాంతిలాల్ కుటుంబం మొత్తం ఆస్తులే రూ.5 నుంచి 10 లక్షలు ఉంటాయన్న నీరజ్ చోప్రా.. అలాంటి వారు రూ. 16 కోట్లు ఎలా అప్పు చేస్తారని అధికారులను ప్రశ్నించారు. ఇదొక ఫేక్ నోటీసని అన్నారు. దీని వల్ల శాంతిలాల్ కుటుంబం ఆసుపత్రి పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. నోటీస్‌పై విచారణ జరిపించాలని అధికారులను డిమాండ్ చేశారు.నోటీసులో రుణం పేర్కొన్న ఆస్తికి అషర్ ఇన్‌ఫ్రా లాజిక్ కంపెనీ యజమానిగా పేర్కొనడం కూడా ఇక్కడ గమనించాలి. దీన్ని బట్టి చూస్తే నోటీసు పంపడంలో బ్యాంకు పొరపాటు పడే అవకాశం బలంగా ఉంది. అలా అయితే, శాంతిలాల్ సోలంకికి తప్పుడు నోటీసులు పంపించిన వారిపై చర్య తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు.