NTV Telugu Site icon

IPL 2025: హర్భజన్‌ సింగ్‌ను సస్పెండ్‌ చేయండి!

Harbhajan Singh

Harbhajan Singh

ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం ఉప్పల్ మైదానంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ 44 పరుగుల తేడాతో ఓడింది. రాయల్స్ ఓటమికి బౌలర్లే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి బౌలర్ కూడా 10కి పైగా ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నారు. స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ అయితే ఏకంగా 19 ఎకానమీతో రన్స్ ఇచ్చాడు. తన 4 ఓవర్ల కోటాలో 76 రన్స్ ఇచ్చిన ఆర్చర్‌.. ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు. అయితే ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరించిన భారత మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌లోని 18వ ఓవర్‌ను జోఫ్రా ఆర్చర్‌ వేయగా.. హిట్టర్ హెన్రిచ్‌ క్లాసెన్‌ వరుసగా బౌండరీలు బాదాడు. ఆ సమయంలో కామెంట్రీ చేస్తున్న హర్భజన్‌ సింగ్‌.. ఆర్చర్‌ను ఎద్దేవా చేశాడు. ‘లండన్‌లో కాలీ ట్యాక్సీల మీటర్ల మాదిరిగానే ఆర్చర్‌ మీటర్‌ ఈ రోజు పరుగెడుతూనే ఉంది’ అని వ్యాఖ్యానించాడు. కాలీ అంటే నలుపు రంగు. దాంతో భజ్జీ జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. హర్భజన్‌ సింగ్‌ ఇలా మాట్లాడడం దారుణం, ఐపీఎల్ 2025 కామెంట్రీ ప్యానెల్ నుంచి హర్భజన్‌ను సస్పెండ్‌ చేయాలని నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇంగ్లాండ్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ గాయాల కారణంగా రెండేళ్లు ఐపీఎల్‌లో ఆడలేదు. భారీ అంచనాలతో ఐపీఎల్‌ 2025లో అడుగుపెట్టిన ఆర్చర్‌.. తొలి మ్యాచ్‌లోనే భారీగా పరుగులు సమర్పించుకుని చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. గతేడాది గుజరాత్‌ టైటాన్స్ బౌలర్‌ మోహిత్‌ శర్మ 73 రన్స్ ఇవ్వగా.. ఆర్చర్‌ 76 పరుగులతో రికార్డు బ్రేక్ చేశాడు.