Suryakumar Yadav: టీ20 ముంబై లీగ్‌లో క్రీడాస్ఫూర్తి.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’ను సహచరుడికి ఇచ్చేసిన టీమిండియా మాజీ కెప్టెన్.!

Suryakumar Yadav

Suryakumar Yadav

Suryakumar Yadav: టీ20 ముంబై లీగ్‌లో భారత స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తన ఆటతోనే కాకుండా క్రీడాస్ఫూర్తితోనూ అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. ఎంఎస్‌సీ మరాఠా రాయల్స్‌పై జరిగిన మ్యాచ్‌లో ట్రయంఫ్ నైట్స్ ఎంఎన్‌ఈ జట్టుకు సీజన్‌లో తొలి విజయాన్ని అందించిన సూర్యకుమార్.. తనకు వచ్చిన ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును సహచర ఫాస్ట్ బౌలర్ సిల్వెస్టర్ డిసౌజా (Sylvester Dsouza)కు అందించి క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడు.

వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో 153 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సూర్యకుమార్ యాదవ్ కేవలం 36 బంతుల్లోనే 13 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో అజేయంగా 72 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి తోడుగా నూతన్ కుమార్ గోయల్ కూడా అర్ధశతకంతో జట్టుకు అండగా నిలిచాడు. దీంతో ట్రయంఫ్ నైట్స్ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించి సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఈ అద్భుత ఇన్నింగ్స్‌కు గాను సూర్యకుమార్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. అయితే మ్యాచ్ అనంతరం ఆ అవార్డును ‘సిల్వెస్టర్ డిసౌజా’కు అందించాడు. తొలి ఇన్నింగ్స్‌లో డిసౌజా 3.5 ఓవర్లలో 21 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టును కట్టడి చేశాడు.

×
×
Ad

మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన మరాఠా రాయల్స్ జట్టు 19.5 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. ఒక దశలో 73/5తో కష్టాల్లో పడిన జట్టును చిన్మయ్ సుతార్ (32), మ్యాక్స్‌వెల్ స్వామినాథన్ (36) ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 17 ఓవర్ల ముగిసే సరికి 137/5తో ఉన్న రాయల్స్ భారీ స్కోరు వైపు దూసుకెళ్తున్నట్లు కనిపించింది. అయితే సుతార్ రిటైర్డ్ అవుట్ అయిన తర్వాత మిగిలిన వికెట్లు వరుసగా కోల్పోయి చివరి 15 పరుగుల వ్యవధిలోనే కుప్పకూలింది.

ఇదిలా ఉండగా, ఇటీవల భారత టీ20 జట్టు నుంచి సూర్యకుమార్ యాదవ్‌ను తప్పించడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భారత జట్టు కొత్త టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ను ఎంపిక చేయగా, ఈ నిర్ణయం భవిష్యత్ ప్రణాళికల్లో భాగమని భారత ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) వెల్లడించారు. ప్రపంచకప్ విజేత కెప్టెన్‌ను తప్పించడం సులభమైన నిర్ణయం కాదని, అయితే జట్టు భవిష్యత్ అవసరాలు, తదుపరి ప్రపంచకప్ దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని అగార్కర్ అన్నారు. సూర్యకుమార్ ఫామ్ కూడా ఈ నిర్ణయానికి మరో కారణమని ఆయన స్పష్టం చేశారు.

జాతీయ జట్టులో చోటు కోల్పోయిన తర్వాత కూడా.. సూర్యకుమార్ యాదవ్ దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేస్తూ తన స్టామినా ఏంటో చూపించాడు. బ్యాటింగ్‌తో పాటు తన సహచర ఆటగాళ్ల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన విధానం అభిమానుల నుండి ప్రశంసలు అందుకుంటోంది.