NTV Telugu Site icon

Suryakumar Yadav: సూర్యకుమార్‌ యాదవ్‌కు కొత్త ఆరోగ్య సమస్య.. ఐపీఎల్‌ 2024కు దూరం!

Suryakumar Yadav Batting

Suryakumar Yadav Batting

Suryakumar Yadav to miss IPL 2024 initial matches due to Sports Hernia: ఐపీఎల్ ప్రాంచైజీ ముంబై ఇండియన్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఐపీఎల్ 2024 ఆరంభ మ్యాచ్‌లకు టీమిండియా స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 సూర్యకుమార్‌ యాదవ్‌ దూరమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే చీలమండ గాయంతో బాధపడుతున్న సూర్య.. మరో ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాడట. స్పోర్ట్స్‌ హెర్నియాతో ముంబై బ్యాటర్ ఇబ్బందిపడుతున్నట్లు తెలుస్తోంది. సర్జరీ కోసం జర్మనీ వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం. దాంతో సూర్య మరి కొన్నాళ్లపాటు క్రికెట్‌కు దూరం కానున్నాడట.

‘సూర్యకుమార్‌ యాదవ్‌ స్పోర్ట్స్‌ హెర్నియాతో బాధపడుతున్నాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎస్‌సీఏ)లో సూర్య చికిత్స పొందుతున్నాడు. 2-3 రోజుల్లో సర్జరీ కోసం మ్యూనిచ్‌ (జర్మనీ)కు బయలుదేరుతాడు. రంజీ ట్రోఫీ టోర్నీ సహా ఐపీఎల్‌ 2024 ఆరంభ మ్యాచ్‌లకు సూర్య దూరమవుతాడు’ అని ఓ జాతీయ మీడియాకు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. జూన్‌లోనే టీ20 ప్రపంచకప్‌ 2024 ఉన్న నేపథ్యంలో ఒకవేళ కోలుకున్నా ఐపీఎల్ 2024లో సూర్యను ఆడించే సాహసం బీసీసీఐ చేయకపోవచ్చు. రిస్క్ ఎందుకనుకుంటే ఐపీఎల్ 2024 మొత్తానికి సూర్య దూరమవుతారు. చీలమండ గాయం కారణంగా సూర్య ఇప్పటికే అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు.

ఒకవేళ ఐపీఎల్ 2024కు సూర్యకుమార్‌ యాదవ్‌ దూరమైతే ముంబై ఇండియన్స్‌ ఎదురుదెబ్బ తగులుతుంది. ఎందుకంటే ఇప్పటికే కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా గాయంతో ఆటకు దూరంగా ఉన్నాడు. హార్దిక్ ఎప్పుడు జట్టులో చేరుతాడో ఇంకా స్పష్టత లేదు. ఇప్పుడు సూర్యకుమార్‌ కూడా దూరం అయితే ఇద్దరు కీలక ఆటగాళ్లు లేకుండానే ముంబై ఐపీఎల్‌ 2024 ఆడాల్సి ఉంటుంది. హార్దిక్ ఆడకుంటే రోహిత్ శర్మ జట్టు సారథ్య బాధ్యతలు అందుకుంటాడు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Also Read: Rafael Nadal: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నుంచి తప్పుకున్న రాఫెల్ నాదల్‌!

కండరాల్లో నొప్పి లేదా గజ్జల్లో గాయం కావడాన్ని స్పోర్ట్స్‌ హెర్నియాగా భావిస్తారు. పొట్ట దిగువన తీవ్రమైన నొప్పి రావడాన్ని కూడా స్పోర్ట్స్‌ హెర్నియాగా పరిగణిస్తారు. ప్రొఫెషనల్‌ ప్లేయర్లే కాదు.. ఆటలు ఆడే చాలా మందిలో సాధారణంగా ఈ సమస్య ఉంటుంది. హెర్నియా, స్పోర్ట్స్‌ హెర్నియా వేరు.