NTV Telugu Site icon

Suryakumar Yadav: ఆ విషయం చెప్పేందుకు సిగ్గుపడాల్సిన అవసరం లేదు: సూర్యకుమార్‌

Suryakumar Yadav Odi Numbers

Suryakumar Yadav Odi Numbers

Suryakumar Yadav Says My ODI Numbers Are Absolutely Bad: ఎట్టకేలకు భారత మిస్టర్ 360 సూర్యకుమార్‌ యాదవ్ తిరిగి ఫామ్‌ అందుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో 21 రన్స్ చేసిన సూర్య.. రెండో టీ20 మ్యాచ్‌లో 1 పరుగుకే పెవిలియన్ చేరాడు. కీలకమైన మూడో టీ20 మ్యాచ్‌లో మాత్రం తనదైన షాట్లతో విరుచుకుపడ్డాడు. క్రీజ్‌లోకి వచ్చిన వెంటనే బౌండరీలు, సిక్స్‌లతో చెలరేగాడు. విండీస్ బౌలర్లను ఆటాడుకుంటూ మైదానం నలుమూలలా పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే 23 బంతుల్లోనే అర్ధ శతకం చేశాడు. మూడో టీ20లో మొత్తంగా 44 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 83 పరుగులు చేశాడు.

వన్డే ప్రపంచకప్‌ 2023లో సూర్యకుమార్‌ యాదవ్ ఆడితే బాగుంటుందని భారత ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే టీ20లతో పోలిస్తే.. వన్డేల్లో సూర్య గణాంకాలు మెరుగ్గా లేవు. ఇదే విషయంపై తాజాగా అతడు స్పందించాడు. వన్డేల్లో తన గణాంకాలు మెరుగ్గా లేవని, ఈ విషయం చెప్పేందుకు సిగ్గుపడాల్సిన అవసరం లేదన్నాడు. మ్యాచ్ అనంతరం సూర్యకుమార్‌ యాదవ్ మాట్లాడుతూ… ‘నా వన్డే కెరీర్ గణాంకాలు ఏమంత బాగా లేవు. దానిని అంగీకరించడానికి సిగ్గుపడాల్సిన పని లేదు. ఈ పరిస్థితుల నుంచి ఎలా మెరుగు పడాలనే దానిపై శ్రమిస్తా’ అని అన్నాడు.

‘కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో కూడా ఈ విషయంపై చర్చించా. వన్డే ఫార్మాట్‌లో నువ్వు ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు కాబట్టి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. మరింత ప్రాక్టీస్ చేసి పరిస్థితికి అనుగుణంగా ఆడాలని చెప్పారు. చివరి 10-15 ఓవర్లలో బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు జట్టు కోసం నువ్ ఏం చేయగలవో అదే చేయాలని వారు సూచించారు. నాకు వచ్చిన అవకాశాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలనేది నా చేతుల్లోనే ఉంది. మంచి ప్రదర్శన ఎప్పుడూ ముఖ్యమే’ అని సూర్యకుమార్‌ యాదవ్ చెప్పాడు.

Also Read: Hardik Pandya Trolls: హార్దిక్‌ పాండ్యాకు ఇంత స్వార్ధమా.. కాస్త ఎంఎస్ ధోనీని చూసి నేర్చుకో!

సూర్యకుమార్‌ యాదవ్ 51 టీ20ల్లో మూడు సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలతో 1,780 పరుగులు చేశాడు. దాంతో టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. వన్డే ఫార్మాట్‌లో మాత్రం సూర్య ఇప్పటివరకు సరైన ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. 26 వన్డేలు ఆడిన అతడు 511 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఒకే ఒక్క టెస్టు ఆడిన సూర్య.. 8 పరుగులు చేశాడు.