ఐపీఎల్ 2025 ముందు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు మరో షాక్ తగిలే అవకాశం ఉంది. ఇప్పటికే టీమిండియా టీ20 కెప్టెన్సీ కోల్పోయిన హార్దిక్.. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ సారథ్యం కూడా కోల్పోనున్నాడని తెలుస్తోంది. ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతల నుంచి హార్దిక్‌ను తప్పించి.. మిస్టర్ 360, స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు అప్పగించే అవకాశం ఉన్నట్లు క్రికెట్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. హార్దిక్ ఫిట్‌నెస్ సమస్యల నేపథ్యంలోనే ముంబై మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం.
ఐపీఎల్ 2025 కోసం మెగా వేలం ఈ ఏడాది చివరలో జరగనుంది. వేలం నిర్వహణపై ఇప్పటికే బీసీసీఐ కసరత్తులు మొదలుపెట్టింది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఇటీవలే ప్రాంచైజీలతో సమావేశం ఏర్పాటు చేసింది. ఎక్కువ మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఇవ్వాలని ప్రాంచైజీలు కోరినట్లు తెలుస్తోంది. ముంబై ఇండియన్స్ కూడా 7-8 మందికి అవకాశం ఇవ్వాలని కోరిందట. ఇక రిటెన్షన్ చేసుకోవాల్సిన ఆటగాళ్లపై ముంబై ప్రత్యేక దృష్టి పెట్టింది. అయితే కెప్టెన్సీ మార్పుపై అసంతృప్తిగా ఉన్న రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్‌లు రిటెన్షన్‌కు ఒప్పుకోవడం లేదట.
Also Read: Pink Ball Test: అందుకే డే/నైట్ టెస్టులు భారత్‌లో నిర్వహిచడం లేదు: జై షా
ముంబై ఇండియన్స్ ప్రస్తుతం బుజ్జగింపు చర్యలకు దిగిందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే సూర్యకుమార్ యాదవ్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించేందుకు సిద్దమైనట్లు సమాచారం. హార్దిక్ పాండ్యా నేతృత్వంలో ముంబై ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇటీవలే సూర్య భారత టీ20 జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఫిట్‌నెస్ సమస్యలను కారణంగా చూపి.. హార్దిక్‌పై బీసీసీఐ వేటు వేసింది,. ఇప్పుడు ముంబై కూడా దాన్నే సాకుగా చూపనుంది. ఇదే జరిగితే హార్దిక్‌కు డబుల్ షాక్ తగులుతుంది. అదే సమయంలో సూర్యకు డబుల్ ప్రమోషన్ దక్కుతుంది.